దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సినిమాలు అన్నీ కూడా ప్రయోగాలతో కూడుకొని ఉంటాయి. అప్పుడున్న ట్రెండ్ కు భిన్నంగా కమర్షియల్ ఎలిమెంట్స్ కి పూర్తి విభిన్నంగా ఆయన సినిమాలు ఉంటాయి. ఆయన ఆలోచించి, ప్రేక్షకుడిని ఆలోచింప చేసే విధంగా సినిమాలు తీస్తూ ఉంటారు. అలా ఆయన మస్తిష్కంలో నుండి ఎన్నో ఓ ప్రయోగాత్మక, వినోదాత్మక చిత్రాలు విడుదలై ప్రేక్షకుల ఆనందింపజేసే ఈ విధంగా ఉంటాయి. అలాంటి సినిమాలకి హీరోగా కమల్ హాసన్ నే ఎక్కువుగా సింగీతం శ్రీనివాసరావు ఎన్నుకుంటారు.

దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అమావాస్య చంద్రుడు సినిమా పూర్తయిన తర్వాత కమలహాసన్, సింగీతం శ్రీనివాస్ రావు కాంబినేషన్ లో మరొక సినిమా చేద్దాము అనుకున్న క్రమంలో కమల్ హాసన్ ఒక స్టోరీ లైన్ చెప్పగా దానిపై సింగీతం శ్రీనివాసరావు ఒక కథ రాసుకోవడం జరిగింది. అయితే ఈ సినిమాకి నిర్మాణ బాధ్యతలు కమలహాసన్ తీసుకున్నారు. కమల్ హాసన్ నటించిన విచిత్ర సోదరులు తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి మాతృక అపూర్వ సహోదరగల్ అనే ఒక తమిళ చిత్రం. ఈ చిత్రం అప్పు రాజా గా హిందీ లో విడుదలైంది. 1989లో విడుదలైన విచిత్ర సోదరులు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.

అయితే ఈ సినిమాలో అప్పు అనే కమలహాసన్ పాత్రకి తల్లిగా శ్రీవిద్య నటించింది. జానకి పాత్రలో(హీరోయిన్ గా) గౌతమి నటించింది. కమల్ హాసన్ సేతుపతి, అప్పు, రాజాగా త్రి పాత్రాభినయం చేశారు. ఈ త్రిపాత్రాభినయం చిత్రంలో ఒక మరుగుజ్జు పాత్ర కూడా ఉంది. గ్రాఫిక్స్ లు లేని సమయంలో కమల్ హాసన్ ఎలా ఆ పాత్రలో ఒదిగిపోయారు అన్నది ఇంకా ప్రేక్షకులలో ఒక మిస్టరీగా మిగిలిపోయింది.

మరుగుజ్జు పాత్రలో కాకుండా ఇతర పాత్రలో కమల్ హాసన్ కనిపించినప్పుడు సాధారణంగా క్లోజప్ లేదా లాంగ్ షాట్స్ తీసేవారు. మరుగుజ్జు పాత్ర వచ్చేసరికి ఆయన కాళ్లను వెనుకకు మడిచి 18 అంగుళాల షూస్ ప్రత్యేకంగా తయారు చేయించి ఆయనకు తోడిగేవారు. ఈ సినిమాలో “బుజ్జి పెళ్ళికొడుకు కి రాజయోగము రా” అనే పాటలో ప్రత్యేకంగా ఒక సోఫా ను తయారు చేయించి కమల్ హాసన్ ని నడుము వరకు అందులో దించి అతని ముందు కృత్రిమ కాళ్లను అమర్చి ఆ కృత్రిమ కాళ్ళకి రెండు వైర్లు అమర్చి, కాళ్లు ఊగేలా.. జపాన్ కు చెందిన సెట్ బాయ్ సహకారంతో అలా చేశామని ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. అయితే మానిటర్ లేని సమయంలో, టేక్స్ తీసుకోకుండా కమల్ హాసన్ నటించిన తీరు ఎంతో ప్రశంసనీయమైనదని చెప్పుకోవచ్చు.































