ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే ఒక అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే **అరవ శ్రీధర్**కు సంబంధించిన వీడియోలు, ఆరోపణలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. కీలకమైన విషయం ఏంటంటే… ఈ వ్యవహారంలో ప్రధానంగా చర్చకు వచ్చిన ఇద్దరి ఆచూకీ ఇప్పటికీ బయటపడకపోవడం. ఎమ్మెల్యే శ్రీధర్‌తో పాటు ఆయనపై సంచలన ఆరోపణలు చేసిన వీణ ఎక్కడ ఉన్నారన్నది స్పష్టత లేకుండా మారింది.

ఎమ్మెల్యే శ్రీధర్‌కు సంబంధించిన వీడియో వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే జనసేన పార్టీ అధిష్టానం స్పందించింది. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించగా, ఆ తర్వాత శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. కుటుంబ సభ్యులకు, పార్టీ నేతలకు, కార్యకర్తలకు కూడా ఆయన అందుబాటులో లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఆయన ఎక్కడ ఉన్నారన్నది స్పష్టత లేకుండా పోయింది.
ఇక మరోవైపు, తనపై డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేశారని ఎమ్మెల్యే శ్రీధర్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటూ, లీగల్ ఆప్షన్లపై చర్చలు జరుపుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అదే కారణంతోనే ఆయన పబ్లిక్‌గా కనిపించకుండా ఉన్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఇక శ్రీధర్‌పై ఆరోపణలు చేసిన వీణ పరిస్థితి కూడా అంతే మిస్టరీగా మారింది. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు న్యాయం కావాలన్నదే లక్ష్యమని ఆమె చెబుతున్నారు. ఎమ్మెల్యే తనను మోసం చేశారని, అతడికి శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ వీడియోలు విడుదల చేశారు. అయితే, ఈ ఆరోపణలపై ఆమె ఇప్పటివరకు అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. ఇదే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అయితే వీణపై మాత్రం ఇప్పటికే రెండు కేసులు నమోదు కావడం గమనార్హం. ఓ జర్నలిస్ట్‌పై దాడి కేసులో రైల్వే కోడూరు పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఎమ్మెల్యే శ్రీధర్ తల్లి ప్రమీల ఇచ్చిన ఫిర్యాదుపై కూడా పోలీసులు విచారణ చేపట్టినట్టు సమాచారం.
ఈ మొత్తం వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఎమ్మెల్యే శ్రీధర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టారు. మరోవైపు, ఇది తనకు శ్రీధర్‌కు మధ్య వ్యక్తిగత వివాదమే తప్ప పార్టీలకు సంబంధం లేదని వీణ స్పష్టం చేశారు. అలాగే **పవన్ కల్యాణ్**పై తనకు గౌరవం ఉందని ఆమె చెప్పడం రాజకీయంగా మరో కోణాన్ని తెరపైకి తెచ్చింది.
ఇప్పుడు అందరి ప్రశ్న ఒక్కటే… ఎమ్మెల్యే శ్రీధర్ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లారు? వీణ ఎందుకు బయటకు రావడం లేదు? కేవలం ఆడియోలు, వీడియోల ద్వారానే ఎందుకు ఆరోపణలు కొనసాగుతున్నాయి? ఈ ‘రైల్వే కోడూరు ఎపిసోడ్’లో ఇంకా ఎలాంటి మలుపులు ఉంటాయన్న ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతోంది.



























