మన దైనందిన జీవితంలో ఉప్పు సాధారణ వస్తువే అయినా, సంప్రదాయాల పరంగా దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. పెద్దలు ఉప్పును ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తూ కొన్ని నియమాలు పాటించమని చెబుతుంటారు. ముఖ్యంగా ఉప్పు కొనేటప్పుడు లేదా ఇంటికి తీసుకురావేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా కిరాణా షాపింగ్‌కు వెళ్లినప్పుడు అన్నీ ఒకేసారి కొనడం సహజం. అయితే వాస్తు ప్రకారం ఉప్పును కొన్ని వస్తువులతో కలిపి కొనడం మంచిది కాదని చెబుతారు. ముఖ్యంగా ఇనుప సామగ్రి కత్తులు, కత్తెర్లు, గృహోపకరణాలుతో పాటు ఉప్పు కొనడం నివారించాలని సూచిస్తున్నారు. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఇనుము శనిగ్రహానికి, ఉప్పు లక్ష్మీదేవికి సంకేతాలుగా భావిస్తారు. ఈ రెండింటిని ఒకేసారి ఇంటికి తీసుకురావడం వల్ల ఇంటి వాతావరణంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని నమ్మకం.
అలాగే సూదులు, పిన్నులు వంటి పదునైన వస్తువులతో ఉప్పు కలపకూడదని కూడా పెద్దలు చెబుతుంటారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య చిన్నచిన్న విభేదాలకు దారితీస్తుందని విశ్వాసం. అందుకే ఉప్పు కొనేటప్పుడు ప్రత్యేకంగా వేరే సంచిలో పెట్టుకుని తీసుకురావడం మంచిదని సూచిస్తున్నారు.
కొంతమంది వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పు కొనడం శుభప్రదం. అదే శనివారం రోజు ఉప్పు కొనకుండా ఉండటం ఉత్తమమని అంటారు. అదేవిధంగా ఉప్పు కొనే రోజున పసుపు లేదా తీపి పదార్థాలు కొనడం శుభఫలితాలను ఇస్తుందని సంప్రదాయం చెబుతోంది.
అయితే ఇవన్నీ సాంప్రదాయ నమ్మకాలపై ఆధారపడిన సూచనలు మాత్రమే. శాస్త్రీయ ఆధారాలు లేవు. పాటించాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసం. అయినప్పటికీ ఇంట్లో సానుకూల వాతావరణం కోసం చిన్న జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పు లేదు.
ఇల్లు సుఖశాంతులతో నిండాలంటే కృషి, పరస్పర అవగాహన, ఆర్థిక నియంత్రణ వంటి అంశాలే అసలు మూలాధారాలు. వాస్తు సూచనలు వాటికి తోడ్పాటుగా భావిస్తే సరిపోతుంది.
































