Premasagaram Movie: ఏ అడ్డంకులు లేని ప్రేమ ఏమవుతుందో తెలియదు. కాని ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న ప్రేమ బలపడి, గట్టిపడి కడవరకూ నిలుస్తుంది. అమ్మాయికి అబ్బాయి కావాలి. అబ్బాయికి అమ్మాయి కావాలి. తొలి ప్రేమలో గాఢమైన తొలి కౌగిలింతకు మించిన పెన్నిధి వారికి లేదు. ప్రేక్షకులు ప్రేమకథలకు సిద్ధమయ్యారు. కాని వీళ్లందరూ మిస్సయ్యింది టి.రాజేందర్ పట్టుకున్నాడు. కాలేజీ. కాలేజీ లైఫ్ చూపించాలి. కాలేజీ అల్లరి. కాలేజీ ప్రేమ. కాలేజీ గంతులు.. పాటలు. నిజంగా కాలేజీ వయసు కుర్రాళ్లతో కాలేజీ ప్రేమ తీయాలని నిశ్చయించుకున్నాడు.

హీరోగా గంగ. హీరోయిన్‌గా నళిని. యవ్వనం.. ఉత్సాహం.. సంగీతం.. కవిత్వం. అందుకే సినిమా అంతా ఒక పాటలా ఉండాలని అనుకున్నాడు. ప్రతి పదిహేను నిమిషాలకు ఒక పాట.పాట పండింది. ‘ప్రేమ సాగరం’ కలెక్షన్లతో పొంగింది. ‘నామం పెట్టు నామం పెట్టు కాలేజీకిచిన్నదాని చెయ్యేపట్టు మేరేజీకి’… సినిమా మొదలైన మొదటి రెండు నిమిషాల్లోనే పాట. ఉత్సాహకరమైన క్లాస్‌రూములు. కలర్‌ఫుల్ క్యాంపస్ పరిసరాలు. ఇటు అమ్మాయి అటు అమ్మాయి ఎటు చూసినా అమ్మాయిలే. ఆ ఊరి కాలేజీలో చదువుదామని నళిని వస్తుంది.
ఆ ఊరి అబ్బాయే గంగ. ఆ అమ్మాయిని చూస్తాడు. ఇద్దరివీ ఎదురూబొదురూ ఇళ్లు. నళినికి ప్రేమ పట్ల సదభిప్రాయం లేదు. అలాంటి ఆలోచన లేదు. పైగా ఈ చిల్లర మల్లర ఊరి కుర్రాళ్లంటే లెక్క లేదు. కాని గంగకు నళినిని చూడటంతోటే ప్రేమైంది. వెంట పడ్డాడు. అతడి వ్యవహారం చూసి నళిని చిరాకు పడింది. అసహ్యించుకుంది. ద్వేషించింది. బుద్ధి చెప్పాలనుకుంది. అతడు రాసినట్టుగా లవ్ లెటర్ సృష్టించి ప్రిన్సిపాల్‌కు కంప్లయింట్ చేసింది. దానికి ప్రతీకారంగా కాలేజీ నాటకంలో అతడు స్టేజీ మీద అందరూ చూస్తుండగా ఆమెను ముద్దాడాడు. ఇలా కథ కొనసాగుతోంది…

ఉయిరుళ్లవరై ఉష (ఉషతో కడదాక)
టి. రాజేందర్ దర్శకత్వంలో 1983లో వచ్చిన ‘ఉయిరుళ్లవరై ఉష’ తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయినట్టుగానే తెలుగులో ‘ప్రేమసాగరం’గా అంతే పెద్ద హిట్టయ్యింది. ఈ సినిమా పోస్టర్లు, పాటలు దుమ్ము దులిపేశాయి. ఇంత పెద్ద ప్రేమదుమారం ఇంతకు ముందు తెలుగు ప్రాంతం చూడలేదు. ‘చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి’, ‘అందాలొలికే సుందరి రాతిరి కలలోకొచ్చేను’, ‘బంతాడే బంగారు బొమ్మల్లారా’… ప్రతి పాటా హిట్. అంతవరకూ తెలుగు ప్రేక్షకులు ‘కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం– దాసరి’ అనే టైటిల్ చూశారు.
కాని టి.రాజేందర్ విషయంలో ‘సంగీతం’ అదనంగా చేరడం వింతగా చూశారు. మ్యూజిక్ చేసే హీరో అప్పట్లో వింత. రాజేందర్ ఈ సినిమాలో తల నిండా జుట్టు వేసుకుని ‘ప్రేమ రక్షకుడి’గా నిలవడాన్ని ఆ తర్వాత చాలా సినిమాల్లో అలాంటి రక్షకుని పాత్రలు సృష్టించి కాపీ చేశారు. ‘నళని’ ఈ తొలి సినిమాతో స్టార్ అయ్యింది. ‘అమల’, ‘జీవిత’లను కూడా టి.రాజేందరే వెండితెరకు పరిచయం చేశాడు. ప్రేమ కథలో యాక్షన్‌ను మిళితం చేయడం, వాన పాట, షవర్ పాట… ఇవన్నీ సగటు ప్రేక్షకుడికి కావలసిన సరంజామాను ఇస్తాయి.

తన్నులు తిన్న హీరోని ‘నా దగ్గర ఉన్న మందు ఇదే’ అని హీరోయిన్ ఒళ్లంతా ముద్దులు పెట్టడాన్ని ఆ రోజుల్లో ఏ కుర్రవాడు ఆశించడూ? ఇవన్నీ సినిమాని పెద్ద హిట్ చేశాయి. రాజేందర్ భార్య ‘ఉష’ తెలుగుమ్మాయి. ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా తనే. కనుక ఇది తెలుగువారి ప్రమేయం ఉన్న సినిమాగా కూడా గుర్తు పెట్టుకోవాలి. అయితే దర్శకుడు టి రాజేందర్ పరిచయం చేసిన హీరో హీరోయిన్లలో ప్రేమ సాగరం హీరో గంగా ఒకరు.. ఈ సినిమా అనంతరం ఆయన మరొక తమిళ చిత్రంలో నటించారు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
ఆ తర్వాత సినిమాలు చేయలేదు. ఆ తర్వాత కూడా ఆయన చిరునామా దొరకలేదు. హీరో గంగకు పచ్చకామెర్ల వ్యాధి సోకి చనిపోయారని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు అసంతృప్తికి గురయ్యారు. గంగా బతికుంటే ఒక పెద్ద స్టార్ హీరో అయ్యేవారేమో అనిపిస్తుంది. తెలుగులో డబ్బింగ్ చిత్రం ద్వారా పరిచయమైన గంగకు ఆ రోజుల్లో చాలామంది అభిమానులు అయ్యారు. ఒక డబ్బింగ్ సినిమా తెలుగులో సంవత్సరం పాటు ఆడిందంటే.. ఆనాటి యువతను “ప్రేమ సాగరం” సినిమా ఎంతగా ఆకట్టుకుందో అర్థమవుతుంది.

































