రాజశేఖర్ ‘అన్న’ సినిమాకు పోటీగా వచ్చిన అగ్ర తారల సినిమాలివే ..

రాజశేఖర్ నటించిన సెన్సేషనల్ హిట్‌ అన్న సినిమాకు పోటీగా ఆ రోజుల్లో చాలానే వచ్చాయి. ఇక వివరాల్లోకి వెళితే ఈ చిత్రం ఏప్రిల్ 7, 1994లో రిలీజైంది. ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గౌతమి, రోజాలు కథానాయికలుగా నటించారు. ఆ అన్నకు తమ్ముడిగా బాలాదిత్య నటించి అందరిచేత మన్ననలు అందుకున్నారు. నటన పరంగా నటీనటులను వేరే లెవల్‌కు తీసుకెళ్లింది ఈ సినిమా.

ఇక సినిమా నేపథ్యం గురించి చెప్పాలంటే అడవిలో బతికే ఓ యువకుడు పట్నం వచ్చి అక్కడి రౌడీ మూకల ఆటలు ఎలా కట్టించాడనేది ఆధ్యంతం ఎమోషనల్‌గా తీశారు. కీరవాణి సంగీతం ఈ చిత్రానికి మరింత బలాన్నిచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ చిత్రంలో హీరో రాజశేఖర్ బాడీ లాంగ్వేజ్, స్టైల్ అన్నింటిలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. దాని ఫలితమే ఫిల్మ్‌ ఫేర్ అవార్డుతో పాటు, 4 నంది అవార్డులు.

ఇకపోతే ఈ సినిమా టైంలో వచ్చిన సినిమాలను చూసుకున్నట్లయితే అన్న సినిమా రిలీజైన రోజే విడుదలై సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఘరానా అల్లుడు. ఈ చిత్రంలో మాల శ్రీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ద్వారా ముప్పలనేని శివ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య కలతల నేపథ్యంలో జగపతిబాబు హీరోగా చేసిన మూవీ భలే పెళ్లాం. ఇది కూడా అంతటి హిట్‌ను అందుకోలేకపోయింది.

ఇదిలా ఉండగా అన్న సినిమా విడుదలైన వారం తర్వాత బాలకృష్ణ నటించిన భైరవ ద్వీపం రిలీజైంది. ఓపెనింగ్స్‌ నుంచే మంచి విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను వసూలు చేసింది. అయితే అప్పటికే అన్న సినిమా రావడంతో ఈ సినిమా ప్రభావం దానిపై ఏ మాత్రం పడలేదని చెప్పవచ్చు. ఆ తర్వాత కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన చిత్రం నాగార్జున హీరోగా నటించిన హలో బ్రదర్. ఈ సినిమా కూడా అప్పట్లో విశేష స్పందనను చూరగొందని చెప్పవచ్చు.