తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అస్తమాను ఢిల్లీ పర్యటన పెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలన్నా హస్తినకు తీసుకెళ్లి మరీ కండువా కప్పిస్తున్నారు. చూసేవారికి కూడా విచిత్రంగా అనిపిస్తోంది. ఏంటిది.. పదే పదే ఢిల్లీకి వెళుతున్నారు.. అసలు తెలంగాణలో పాలన పరిస్థితేంటని అంతా చర్చించుకుంటున్నారు. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే హస్తినలో మరోలా ఉందట. రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం క్లాసుల మీద క్లాసులు పీకుతోందట. కారణమేంటంటారా? రేవంత్ చెప్పిందొకటి చేస్తోంది మరొకటని ఏకి పారేస్తున్నారట.. వారానికోసారి ఢిల్లీకి ఈ రాకపోకలేంటని గట్టిగా క్లాస్ పీకేసిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అసలు ఎందుకు రేవంత్‌ను ఏకాల్సిన అవసరం అధిష్టానానికి వచ్చిందంటారా? దానికో ఓ కారణముంది? అధిష్టానం చురకలతో రేవంత్ గట్టిగానే ఫిక్స్ అయ్యారట. ఈ న్యూస్ బయటకు రావడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయిపోయింది. ఏంటిది.. బోడిగుండుకు.. మోకాలుకు ముడిపెడుతున్నారని అనిపిస్తోందా? కాంగ్రెస్ అధిష్టానం.. రేవంత్‌ను తిట్టడమేంటి? ఆయన గట్టిగా ఫిక్స్ అవడమేంటి? దీనికి బీఆర్ఎస్ అలర్ట్ అవడమేంటి? అంటారా? అయితే ఈ కథనం చదవాల్సిందే..

ఒక్కొక్కరి చొప్పున ఎంతకాలం?
బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి దెబ్బ తిన్నది. పార్లమెంటు ఎన్నికల ద్వారా అయినా ఆ దెబ్బలకు కాస్త ఆయింట్‌మెంటు రాసుకుందామంటే.. ఈసారి ఏకంగా చావు దెబ్బే తగిలింది. అంతే.. బీఆర్ఎస్ ఖేత్ ఖతమ్. తెలంగాణలో పత్తా లేకుండా పోయింది. ఇక కేసీఆర్ లక్కీ నంబర్ అయిన ఆరుపై రేవంత్ గురి చూసి మరీ కొడుతున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీల చొప్పున కాంగ్రెస్‌లోకి లాక్కొచ్చారు. కారు పార్టీ ఖల్లాస్ అనడానికి లేదు కానీ రేవంత్ ప్లాన్ మాత్రం కల్వకుంట్ల ఫ్యామిలీ మినహా అందరినీ లాగాలని.. ఈ మంగమ్మ శపథాన్నే ఢిల్లీకి వెళ్లి అధిష్టానం వద్ద చేసి వచ్చారట. వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి లాగిన వారిని ఒక్కొక్కరిని చొప్పున తీసుకెళ్లి కాంగ్రెస్ తీర్థం ఇప్పిస్తుంటే.. ఇచ్చేవారికైనా చిరాకు వస్తుంది కదా.. ఒక్కొక్కరి చొప్పున ఎంతకాలం పోయాలి? అందరినీ పట్టుకురా అంటోందట అధిష్టానం. ఇదీ కథ. బీఆర్ఎస్‌ను ఖతమ్ చేస్తానని శపథం చేసిన రేవంత్.. ఇలా వారానికొకరిని తీసుకెళ్లడం అధిష్టానానికి చిరాకు తెప్పించిందట. అందుకే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట.
కంగుతిన్న రేవంత్..

ఇటీవల రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడే ఖర్గే ఆయనను వాయించి వదిలిపెట్టారని టాక్. అంతకు ముందేమో బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తా.. అని ప్రగల్భాలు పలికి వెళ్లావు కదా.. మరి ఏంటిది? అని ప్రశ్నించారట. వారానికొకరిని తీసుకొచ్చి.. షో చేస్తున్నావేంటని ప్రశ్నించారట. విలీనం ఎంత వరకూ వచ్చిందని నిలదీశారట. మొత్తానికి ఈ వ్యవహారంతో కంగుతిన్న రేవంత్ రెడ్డి.. ఇకపై కుంభస్థలాన్నే కొట్టాలని డిసైడ్ అయ్యారట. ఇక తగ్గేదేలే.. మొత్తానికి గాలం వెయ్యాలి.. తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా కప్పించాలని డిసైడ్ అయ్యారట. విషయం కాస్త బీఆర్ఎస్‌కు లీక్ కావడంతో ఆ పార్టీ అలర్ట్ అయిపోయింది. ఇప్పటి వరకూ పోయిన వాళ్లు పోయారు.. ఇక ఉన్నవారినైనా కాపాడుకోవాలని భావిస్తోందట. ఒక్క ఎమ్మెల్యేను కూడా ఇకపై చేజార్చుకోవద్దని బీఆర్ఎస్ గట్టిగా నిర్ణయించుకుందట. మరి ఇద్దరూ గట్టిగానే ఫిక్స్ అయ్యారు. మరి చివరకు ఎవరు నెగ్గుతారో.. ఎవరు తగ్గుతారో చూడాలి. ఈ మొత్తం వ్యవహారం మీద పాలనను గట్టెక్కించకుండా రేవంత్ చూసుకోవాలి. లేదంటే అసలుకే ఎసరు రావడం ఖాయం.



































