ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సీఎం చంద్రబాబుకు తాను మద్దతు తెలుపుతున్నట్లు వైసీపీ నాయకురాలు రోజా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రోజాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. గతంలో వైసీపీ నాయకులు తనపై, తన తల్లి విజయమ్మపై చేసిన నీచమైన ప్రచారాలను గుర్తు చేసుకుని షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

“రోజా, వైసీపీ కలిసి నాపై అక్రమ సంబంధాలు ఆపాదించారు. నా రక్త సంబంధీకులే నాపై విష ప్రచారం చేశారు. నేను వైఎస్సార్‌కు పుట్టలేదని దారుణంగా ప్రచారం చేశారు. విజయమ్మకు నేను అక్రమ సంతానమని కూడా ప్రచారం చేశారు. మీరు చేసిన ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యల వల్ల నేను ఎంత మానసిక క్షోభ అనుభవించానో ఒక్కసారి ఆలోచించండి” అంటూ షర్మిల కన్నీటి పర్యంతమయ్యారు.
గతంలో తన సోదరుడు కష్టాల్లో ఉన్నాడని తెలియగానే, రక్త సంబంధానికి విలువనిచ్చి 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని షర్మిల గుర్తు చేశారు. “మీరు మనుషులు కాదు. రక్త సంబంధం గురించి మాట్లాడటానికి మీకు సిగ్గుండాలి. విజయమ్మను పార్టీ నుంచి బయటకు పంపిన రోజే మీ పతనానికి పునాది పడింది. ఇప్పటికైనా మీకు బుద్ధి రావాలని కోరుకుంటున్నాను” అని వైసీపీ నాయకులను ఉద్దేశించి షర్మిల తీవ్రంగా విమర్శించారు.
రాష్ట్ర సమస్యలపై జరిగే ప్రజా పోరాటాలకు మాత్రమే తన మద్దతు ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడతానని ఆమె పునరుద్ఘాటించారు. షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
































