విక్రమ్, అరణ్యకాండ, కెప్టెన్ నాగార్జున లాంటి మాస్,కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన చిత్రాల అనంతరం… వాటికి భిన్నంగా ఈ చిత్రంలో నాగార్జున నటించారు. 1987 కోణార్క్ మూవీ క్రియేషన్స్, గీతాకృష్ణ దర్శకత్వంలో “సంకీర్తన” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ హీరో,హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం కథలోనే కాదు, కథనంలోనూ కె. విశ్వనాథ్ గారి ప్రభావం ప్రస్ఫుటంగా కనపడుతుంది. కథనం బొత్తిగా ప్రేక్షకుడికి ఆసక్తిని కానీ, ఆనందాన్ని కానీ కలిగించదు.

గోదావరి జిల్లాలోని పచ్చని పొలాల్లో చిత్రీకరించిన పాటలు చిత్రానికి ఉన్న కాస్త బలం అని చెప్పుకోవాలి. వర్ణ బేధాలు అనే అంశం మీద అప్పటికే కె. విశ్వనాథ్ 1981 లో “సప్తపది” చిత్రం తీసి విజయాన్ని సాధించారు.మళ్ళీ అదే సూత్రం మీద చిత్రం తీయడం, అది కూడా బోరు కొట్టించే విధంగా చెప్పడం ఈ చిత్రానికి బలహీనతగా మారింది.

నటీనటుల ఎంపిక కూడా సరి అయినది కాదు అనిపించింది. నర్తకిగా రమ్యకృష్ణ కొత్తగా ఉన్నప్పటికీ బహుశా తను నిజ జీవితంలో నర్తకి కాకపోవటం ఆ పాత్రకు ఆమె సరిపోలేదు అనడానికి ఒక కారణం కావొచ్చు. కానీ తన పాత్రకు కావాల్సిన నటనని పూర్తిగా ఇచ్చారు రమ్యకృష్ణ. నాగార్జున కూడా తన పాత్రకి సరైన న్యాయమే చేశారు. ఇక ఈ చిత్రంలో పూర్తిగా పనికిరాకుండా పోయిన పాత్ర శ్రావణ్ (శరత్ బాబు). ఆఖరులో కాశిని, కీర్తనని అప్పటికే గోదారి కాపాడేశాడు. ఆ క్షణంలో శ్రావణ్ పాత్ర ప్రవేశం ఉన్నా, లేకపోయినా పెద్ద తేడా ఏమి ఉండదు. కథనం కోసమే సృష్టించిన పాత్రలు మల్లికార్జునరావు, నర్రా వెంకటేశ్వరరావులవి. వీటి ప్రవర్తన కూడా విశ్వనాధ్ చిత్రాల పాత్రలనే తలపిస్తాయి కొత్తగా ఏమి లేవు.

ఈ కథనానికి మరి కాస్త బలం ఇచ్చింది తనికెళ్ళ భరణి మాటలు. కాశి పాత్ర కవి అవ్వడం భరణి గారికి కాస్త ఊతం ఇచ్చింది. ఒక సన్నివేశంలో సముద్రతీరంలో నడుస్తున్న కాశి, కీర్తన ల మధ్య జరిగే సంభాషణలో వచ్చే కవిత్వపు మాటలు చాలా అందంగా ఉంటాయి. మరో మంచి మాట శ్రావణ్ ఒక సన్నివేశంలో పలుకుతాడు. కీర్తన కాశిని ప్రేమిస్తోందని తెలుసుకున్న తరుణంలో బొమ్మను గీయటం ఆపేసిన శ్రావణ్ తన పాలేరుతో “నా స్వార్థాన్ని గీద్దామనుకున్నాను అందుకే అర్థాంతరంగా ఆగిపోయింది” అంటాడు. కథనం పరంగా చూస్తే ఇది ఒక అద్భుతమైన మాట.

ఇక పాట విషయానికి వచ్చినట్లయితే ఈ చిత్రంలో పాటలు, నేపథ్య సంగీతం ఇళయరాజా అందించారు. చిత్రానికి పాటలు, నేపథ్య సంగీతాలే ప్రధాన ఆకర్షణగా నిలిచి, ప్రజాదరణ పొందాయి. పాటల సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సి.నారాయణ రెడ్డి రాశారు. కె.విశ్వనాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన గీతాకృష్ణ.. విశ్వనాధ్ దర్శకత్వం వహించిన శంకరాభరణం, సప్తపది సాగరసంగమం లాంటి చిత్రాలను చూసి అనుభూతి పొందిన గీతాకృష్ణ తను కూడా అలాంటి చిత్రాన్ని తీయాలని.. గంగయ్య నిర్మాణంలో “సంకీర్తన” చిత్రాన్ని రూపొందించారు. మొత్తానికి ఈ రెండు గంటల పదహారు నిమిషాల ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను నిరాశపరిచిందనే చెప్పొచ్చు.




























