మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావం పాకిస్తాన్‌లో గట్టిగా కనిపిస్తోంది. చమురు సరఫరా సమస్యలను ఎదుర్కొంటూ, అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ ప్రభుత్వం మార్చి 31 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. విద్యాసంస్థల్లో పరీక్షలు ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని, ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడానికి అనుమతిస్తారని ప్రకటించారు.

ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల 50 శాతం మాత్రమే ఇంటి నుండి పనిచేయాలని, వారానికి నాలుగు రోజులు మాత్రమే అధికారికంగా పని చేయాలని చెప్పినట్లు స్ధానిక మాధ్యమాల్లో ప్రకటించారు. అలాగే, అన్ని బహిరంగ కార్యక్రమాలు, మేళాలు, సాంఘిక కార్యక్రమాలను నిషేధించారు.
ఇంధనాన్ని ఆదా చేయడమే ప్రధాన కారణమని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ వాహనాలకు ఇంధన కేటాయింపు 50 శాతం తగ్గించడం, పెట్రోల్ మరియు ఇతర ఉత్పత్తుల నిల్వలను నియంత్రించడం తద్వారా సాధ్యం అవుతోంది. ప్రధాన మంత్రి షరీఫ్ ప్రకారం, ఈ నిర్ణయాలు ప్రజల్లో భయాందోళనను సృష్టించకూడదు, కానీ సమయానికి చర్యలు తీసుకోవడం అవసరం.
భారతదేశంలో ఇదే పరిస్థితి వచ్చే అవకాశాలపై ప్రజల్లో ఆందోళన ఉన్నప్పటికీ, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దేశంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేశారు. భారతీయ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరఫరా సక్రమంగా కొనసాగుతోందని చెప్పారు.
ఈ సంక్షోభం పాకిస్తాన్‌లో విద్యాసంస్థలు, ఉద్యోగులు, ప్రజల రోజువారీ జీవనంపై తీవ్ర ప్రభావం చూపనుంది. దేశ ప్రభుత్వాలు ఇంధన ఉత్పత్తులను సమర్థవంతంగా వినియోగించడం, ఆదా చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.


























