Senior Actor Kavitha : చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు ఇలా అన్ని భాషలలోనూ హీరోయిన్ గా చేసిన కవిత గారు తెలుగులోనూ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ చాలా సినిమాల్లో నటించిన ఆమె అటు రాజకీయాల్లో ఉంటూనే నటి గా సీరియల్స్ లోనూ కనిపిస్తూ నటనను కంటిన్యూ చేస్తున్నారు. ఇక అప్పటి ఇండస్ట్రీ ముచ్చట్లతో పాటు తన కుటుంబం వ్యక్తిగతంగా పడిన ఇబ్బందుల గురించి ఎమర్జెన్సీ నాటి చేదు గుర్తులను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సొంతూరు వదిలి హైదరాబాద్ వస్తే…
పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు లో జన్మించిన కవిత గారిది ఉమ్మడి కుటుంబం. అయితే పిల్లలు చదువుల కోసం సిటీకి వెళ్లాలని భావించిన కవిత కుటుంబం వ్యవసాయం వదిలి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ చిక్కడపల్లి లో కిరణాషాప్ పెట్టుకుని పిల్లలను చదివిస్తుండగా అదే సమయంలో ఎమర్జెన్సీ విధించడంతో చాలా ఇబ్బందులు పడ్డామంటూ తెలిపారు కవిత. రేడియో వినాలంటే భయమేసేది. 144 సెక్షన్ అమలులో ఉండటం వల్ల బయట కనిపిస్తే కాల్చేస్తారు దీంతో చాలా మంది మరణించారు కూడా ఆ సమయంలో. సొంతూరు వదిలి ఇక్కడికి వస్తే అలా పరిస్థితి ఉండేసరికి మా నాన్న భయపడ్డారు.

అయితే అదే సమయంలో ఒక రోజు ఎవరైనా వలస వెళ్లిపోవాలనుకుంటే ఏ ఊరికి వెళ్తారో రాయించుకుని తట్ట బుట్ట సర్దుకుని వెళ్లిపోవచ్చు అని ప్రకటించడంతో మా నాన్న ఇంకా కొన్ని కుటుంబాలు కలిసి చెన్నై వెళ్లిపోవాలని నిర్ణయించుకుని అధికారులతో రాయించుకున్నాం. ఇక అలా గూడ్స్ రైలులో బందీల్లాగా కేవలం మా బట్టలు ఒక కిరసనాయిల్ స్టవ్ తో పది రోజు ప్రయాణం చేసి చెన్నయ్ వెళ్ళాం అంటూ ఎమర్జెన్సీ లో పడిన ఇబ్బందులను తెలిపారు. ఇక చెన్నై లో తెలుగు వారు ఉండే ఏరియా అయిన రంగరాజాపురం వెళ్లి అక్కడే ఒక చిన్న గదిలో అద్దెకి ఉండి ఉచితంగా పాఠశాలలో చదువుకుంటుండగా కృష్ణయ్య అనే నిర్మాత చూసి ఓ మంచి సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా జీవితం మారిపోయింది అంటూ కవిత గారు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.



























