గుజరాత్‌లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను విషాదం చోటు చేసుకుంది. లండన్‌కు బయలుదేరిన AI-171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దుర్ఘటన మేఘనీగర్ ఘెడాసర్ క్యాంప్ ప్రాంతంలోని జనారణ్యంలో జరిగింది. విమానం రెండు బహుళ అంతస్తుల భవనాలపై కూలడంతో ఒక్కసారిగా భీకర వాతావరణం నెలకొంది.

రమీలా అనే మహిళ తన కుమారుడి గురించి ఆందోళనగా మీడియాతో మాట్లాడుతూ.. “నా కొడుకు హాస్టల్‌లో ఉన్నాడు. లంచ్ బ్రేక్ కావడంతో భోజనం చేయడానికి వెళ్ళాడు. ఇంతలో విమానం హాస్టల్‌పై కూలిపోయింది. నా కొడుకు క్షేమంగా ఉన్నాడని తెలిసింది. ఫోన్‌లో మాట్లాడినప్పుడు, భయంతో వణికిపోతూ రెండో అంతస్తు నుంచి దూకేసినట్లు చెప్పాడు. ప్రస్తుతం అతనికి గాయాలయ్యాయి” అని కన్నీటి పర్యంతమయ్యారు.
అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వద్ద పూనమ్ పటేల్ అనే యువకుడు తన వదిన గురించి దిగులుగా వివరిస్తూ.. “మా వదిన లండన్‌కు వెళ్తోంది. విమానం ప్రమాదానికి గురైందని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఆమె ఎలా ఉందో తెలియక చాలా కంగారుగా ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
విమాన ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రయాణికుల బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. వారి ఆర్తనాదాలతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి.
విమానం కూలిన సమయంలో లంచ్ బ్రేక్ కావడంతో చాలా మంది పీజీ వైద్య విద్యార్థులు హాస్టల్‌లోనే ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.



























