ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు విధించిన శిక్షను సమర్థిస్తూ, నాలుగు వారాల్లో పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు శిక్షకు సుప్రీంకోర్టు మద్దతు
ఈ కేసులో ముందుగా ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించగా, తర్వాత హైకోర్టు శిక్షను రెండేళ్లకు తగ్గించింది. అయితే జరిమానాను రూ.5 వేల నుంచి రూ.50 వేలకు పెంచింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో ప్రత్యూష తల్లి సరోజినీదేవి కూడా వేర్వేరుగా అప్పీల్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులో జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది.
కేసు నేపథ్యం
ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్న సమయంలో పరిచయమై ప్రేమలో పడ్డారు. అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి అడుగుపెట్టగా, సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. కొంతకాలానికి వారి మధ్య విభేదాలు తలెత్తాయి.
2002 ఫిబ్రవరిలో ఇద్దరూ విషం సేవించిన పరిస్థితిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స సమయంలో ప్రత్యూష ప్రాణాలు కోల్పోయారు. సిద్ధార్థరెడ్డి మాత్రం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దర్యాప్తులో కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగినట్లు తేలింది.
వైద్యుల నివేదిక, సీబీఐ దర్యాప్తు
ప్రత్యూష మరణానికి కారణం ఆర్గానోఫాస్ఫేట్ విషప్రయోగమేనని వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. ఆమెపై లైంగిక దాడి లేదా ఇతర హింస జరగలేదని కూడా స్పష్టం చేశారు. ఈ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపట్టి, భారతీయ శిక్షాస్మృతి 306 సెక్షన్ కింద ఆత్మహత్యకు పురిగొల్పడం, 309 సెక్షన్ కింద ఆత్మహత్యాయత్నం కేసులు నమోదు చేసింది.
2004 ఫిబ్రవరిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సిద్ధార్థరెడ్డికి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. అనంతరం హైకోర్టు శిక్షను రెండేళ్లకు తగ్గించినా, దోషి అన్న నిర్ణయాన్ని కొనసాగించింది.
పోస్టుమార్టం విధానంపై వ్యాఖ్యలు
ఈ కేసులో పోస్టుమార్టం నిర్వహణపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ సమయంలో పద్ధతుల విషయంలో కొన్ని లోపాలు ఉన్నట్లు గమనించినట్టు వ్యాఖ్యానించింది. అయితే, మొత్తం ఆధారాలను పరిశీలించిన తర్వాత హైకోర్టు తీర్పును నిలబెట్టింది.
దాదాపు రెండు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ కేసుకు సుప్రీంకోర్టు తీర్పుతో తుది అధ్యాయం ముగిసినట్టైంది. ఇప్పుడు సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాల్సి ఉంది. సినీ వర్గాలు, న్యాయ వర్గాలు ఈ తీర్పును కీలకంగా భావిస్తున్నాయి.




























