Tag Archives: andhra pradesh

గ్రామ వాలంటీర్లకు షాకింగ్ న్యూస్.. వారిని తొలగించనున్న జగన్ సర్కార్..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పథకాలను ప్రజల ఇళ్ల దగ్గరకు చేర్చాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డ్ వాలంటీర్ల నియామకం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వీరికి 5,000 రూపాయల చొప్పున వేతనం చెల్లిస్తోంది. గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు నేరుగా అందుతున్నాయి. అయితే తాజాగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ, వార్డ్ వాలంటీర్లను తొలగించాలని అధికారులను ఆదేశించింది. జగన్ సర్కార్ రాష్ట్రంలో 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలు చేయడానికి అర్హులని పేర్కొంది. ఎవరైనా ఉద్యోగంలో చేరి 35 సంవత్సరాల వయస్సు దాటితే వాళ్లు విధులకు దూరం కావాల్సి ఉంటుంది.

అయితే రాష్ట్రంలో కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగంలో చేరినట్లు తేలడంతో ప్రభుత్వం వారిని తొలగించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగంలో చేరడానికి 18 సంవత్సరాల వయస్సు ఉండాలి కానీ కొందరు విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగంలో చేరారు. దీంతో 18 సంవత్సరాల లోపు ఉన్న వాలంటీర్లను, 35 సంవత్సరాల వయస్సు దాటిన వాలంటీర్లను ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 2.70 లక్షల మంది గ్రామ, వార్డ్ వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అర్హులు కాని వారిని తొలగించమని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే తొలగింపు ప్రక్రియను ప్రారంభించారని సమాచారం.

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ఉద్యోగాలు..?

ఏపీ ప్ర‌భుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మొత్తం 31 ఖాళీలు ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విడుదలైన నోటిఫికేషన్ లో డీఈఓ, హౌజ్‌కీప‌ర్, లైబ్రేరియ‌న్‌, ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. https://spsnellore.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు నెల్లూరులోని ప్ర‌భుత్వ న‌ర్సింగ్ కాలేజీకి దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా 2020 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కౌన్సెలింగ్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు ఉద్యోగ ఖాళీలను బట్టి అర్హతలో మార్పులు ఉన్నాయి. 5వ తరగతి నుంచి డిగ్రీ, పీజీడీసీఏ వరకు ఒక్కో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కో అర్హత ఉంది. ఈ ఉద్యోగాలలో కొన్ని ఉద్యోగాలకు హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. తక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత, అనుభవం బట్టి వేతనం లభిస్తుంది. ఈ నెల 5వ తేదీన ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. పురుషులతో పాటు స్త్రీలు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త.. పింఛన్ పెరిగేది ఎప్పుడంటే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ తీసుకునే వాళ్లకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో పింఛన్ ఎప్పటినుంచి పెరుగుతుందనే అంశం గురించి స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,250 రూపాయలు పింఛన్ ఇస్తున్నామని ఆ పింఛన్ ను 2,500 రూపాయలకు పెంచుతున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తరువాత వృద్ధాప్య పింఛన్ వయస్సును 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించామని సీఎం చెప్పారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో పింఛన్ పెంపు జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికల ముందు వైసీపీ మేనిఫెస్టోలో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు పింఛన్ పెంచుకుంటూ పోతామని పేర్కొందని ఆ హామీ ప్రకారం పింఛన్ ను పెంచుకుంటూ పోతున్నామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పెంచామని మళ్లీ జులై 8 2021న పింఛన్ పెంపు ఉంటుందని తెలిపారు.

గత ప్రభుత్వం 44 లక్షల మందికి మాత్రమే పింఛన్ పంపిణీ చేసిందని తమ ప్రభుత్వం 61 లక్షల మందికి పింఛన్ ఇస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని తెలిపారు. సీఎంగా పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేశానని అప్పటినుంచి రాష్ట్రంలో 2,250 రూపాయల పింఛన్ పంపిణీ జరుగుతోందని జగన్ పేర్కొన్నారు.

మళ్లీ 2021 సంవత్సరం జులై 8వ తేదీ తరువాత నుంచి 2,500 రూపాయల పింఛన్ ఇస్తామని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై జగన్ అసెంబ్లీలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదే పదే అబద్దాలు చెబుతూ సభను నిమ్మల రామానాయుడు తప్పుదారి పట్టిస్తున్నాడని పేర్కొన్నారు.

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రెండున్నర లక్షల ఉద్యోగాలు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రామ, వార్డ్ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో పాటు రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థల్లోని ఖాళీల వివరాలను తెలియజేసి ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్న సంగతి తెలిసిందే.

జగన్ సర్కార్ తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్న మెగా పారిశ్రామిక పార్కులో ఏ కంపెనీలు పెట్టుబడులు పెడతాయో ఆ కంపెనీలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను ఇవ్వనుంది. వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ పేరుతో ప్రారంభమైన ఈ ఇండస్ట్రియల్ హబ్ ద్వారా ప్రభుత్వం 2.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించగలమని భావిస్తోంది.

జగన్ సర్కార్ కనీసం 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక పాలసీ 2020 – 2023లో ఇచ్చే రాయితీలకు అదనంగా వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్ లో పెట్టుబడులు పెట్టే వాళ్లకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీఐఐసీ పెట్టుబడులు పెట్టే సంస్థలకు 33 సంవత్సరాలకు లీజు పద్ధతిలో భూమిని ఇస్తుంది.

లీజును గరిష్టంగా 99 సంవత్సరాల వరకు పొడిగించుకునే ఛాన్స్ ఉంటుంది. ఉత్పత్తి ప్రారంభమైన పది సంవత్సరాల తర్వాత భూమిని కొనుగోలు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రభుత్వం ఐదేళ్లపాటు యూనిట్‌ విద్యుత్‌పై రూపాయి సబ్సిడీ అందిస్తుంది. స్థిర మూలధన పెట్టుబడిలో గరిష్టంగా ప్రభుత్వం 10 కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తుంది.

ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. ఉచితంగా ఇసుక..?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పేద ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ కరోనా విజృంభణ వల్ల కోత పెట్టిన వేతనాలను డిసెంబర్, జనవరి నెలల్లో ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల కోత విధించిన వేతనాలకు 2,324 కోట్ల రూపాయలు, ఫించనుదారులకు 482 కోట్ల రూపాయలు చెల్లిస్తుందని వెల్లడించారు. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను చెప్పారు.

నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం జగన్ సూచించారని తెలిపారు. రాష్ట్రంలో 31,300 ఎకరాల పంటకు తుఫాను వల్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 10,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని.. 500 రూపాయల చొప్పున పునరావాస శిబిరాల్లో ఉన్నవారికి చెల్లింపులు చేశామని అన్నారు. వచ్చే నెల 30 నాటికి పంట నష్టం అంచనా వేసి రైతులకు అందజేస్తామని పేర్కొన్నారు.

వచ్చే నెల 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని.. ఈ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తుందని కన్నబాబు వెల్లడించారు. తొలి దశలో 16 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. వైఎస్సార్ పంటల బీమా చెల్లింపులు వచ్చే నెలలో అమలు చేస్తామని అన్నారు. డిసెంబర్ 2న అమూల్ ప్రాజెక్ట్, డిసెంబర్ 10న మేకలు, గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్టు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ చట్టం 1974లో సవరణలు చేస్తున్నట్టు తెలిపారు. పల్నాడు ప్రాంతంలో కరువు నివారణకు కార్పొరేషన్, ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల కోసం అభివృద్ధి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వాస్త్రవ డిజైన్ ల ఆధారంగా పోలవరం నిర్మాణం జరుగుతుందని అన్నారు.

సీఎం జగన్ కీలక నిర్ణయం.. రూ. 10 వేలు రానివాళ్లు ఏం చేయాలంటే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ ప్రజలకు ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ సర్కార్ కరోనా, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని జగనన్న తోడు స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా వీధివ్యాపారులకు 10,000 రూపాయలు అందించింది.

అయితే కొందరు జగనన్న తోడు పథకానికి అర్హులైనా 10,000 రూపాయలు పొందలేదని సీఎం జగన్ దృష్టికి వచ్చింది. దీంతో సీఎం జగన్ 10,000 రూపాయలు అందని వాళ్లకు ప్రయోజనం చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులై లబ్ధి పొందలేని చిరు వ్యాపారులు మరోసారి ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ స్కీమ్ లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డ్ సచివాలయాలలో పొందుపరిచింది.

సహాయం, ఫిర్యాదుల కొరకు 1902 నంబర్ కు కాల్ చేయమని అధికారులు సూచించారు. జగన్ సర్కార్ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిర్ణయాల ద్వారా ప్రయోజనం చేకూర్చాలని భావిస్తోంది. ఎవరైతే అర్హత ఉండి దరఖాస్తు చేస్తారో వాళ్లకు నెలరోజుల్లో ఖాతాల్లో నగదు జమ చేయడానికి సిద్ధమవుతోంది. అర్హులైన చిరువ్యాపారులు వడ్డీ లేని రుణాలను పొందవచ్చు.

చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తూ ఉండటం గమనార్హం. జగన్ సర్కార్ ఈ పథకం అమలు చేయడంపై చిరువ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం అమలు ద్వారా తమకు ప్రయోజనం చేకూరుతోందని చెబుతున్నారు.

ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్.. రేషన్ ధరలు పెరగనున్నాయా..?

కరోనా విజృంభణ, లాక్ డౌన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో రేషన్ దుకాణాల్లో ఇచ్చే నిత్యావసర వస్తువుల ధరలు సైతం పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జగన్ సర్కార్ ఇప్పటికే చక్కెర రేటును పెంచగా త్వరలో కందిపప్పు రేటును కూడా పెంచబోతుందని సమాచారం. కందిపప్పు ప్రస్తుతం ఇస్తున్న రేటుతో పోలిస్తే 27 శాతం ధర పెరగనుందని తెలుస్తోంది.

జగన్ సర్కార్ రాష్ట్రంలో రేషన్ సరుకులకు మార్కెట్ ధరతో పోల్చి చూస్తే 25 శాతం మాత్రమే సబ్సిడీ ఇవ్వాలని భావిస్తోంది. ప్రభుత్వం రేషన్ డీలర్ల నుంచి ఇప్పటికే పెంచిన ధరల ప్రకారం డీడీలను స్వీకరిస్తోందని తెలుస్తోంది. గతంలో ప్రభుత్వం అరకిలో పంచదార రూ.10కు ఇవ్వగా ప్రస్తుతం రూ.17కు ఇస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కందిపప్పును ప్రభుత్వం కిలో రూ.40కు ఇస్తుండగా జగన్ సర్కార్ కందిపప్పు ధరకు రూ.67కు పెంచాలని భావిస్తోంది.

జగన్ సర్కార్ ప్రతి 90 రోజులకు ఒకసారి బహిరంగ మార్కెట్ లోని ధరలను పరిశీలించి ధరలలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కందిపప్పు ధరల పెంపు గురించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రభుత్వం రాష్ట్రంలో రేషన్ బియాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. మార్చి నెల నుంచి లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో ప్రభుత్వం ఉచితంగా రేషన్ పంపిణీ చేపడుతోంది.

ఈ నెల తరువాత ప్రభుత్వం ఉచిత రేషన్ ను పంపిణీ చేయదు. అయితే రేషన్ దుకాణాల్లో ఇచ్చే నిత్యావసర ధరలను పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల పెంపు విషయంలో ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.

కరోనా సెకండ్ వేవ్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ తగ్గడంతో పాటు పలు జిల్లాల్లో 50 లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా కేసులు తగ్గినా వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తాజాగా కరోనా సెకండ్ వేవ్ గురించి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శీతాకాలం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గడంతో కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో జగన్ మాట్లాడుతూ యూరప్ లో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని చెప్పారు. ఢిల్లీలో కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ అమలు దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. అమెరికా సైతం కరోనా వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పారు.

ఫ్రాన్స్, లండన్‌ వైరస్ వ్యాప్తి వల్ల షట్ డౌన్ లో ఉన్నాయని.. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ అమలవుతోందని అన్నారు. సెకండ్ వేవ్ రాకుండా కరోనా నిబంధనలు పాటించి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. కాలేజీలు, పాఠశాలలు తెరుస్తున్నామని కలెక్టర్లు కరోనా వైరస్ మళ్లీ విజృంభించకుండా తగిన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

గతంతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందని.. అయితే సెకండ్ వేవ్ ఇతర దేశాల్లో వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలు సైతం కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం గతంలో ప్రకటన విడుదల చేయగా పరీక్షల నిర్వహణకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సిద్ధమైంది. నిజానికి చాలా నెలల క్రితమే పరీక్షలు జరగాల్సి ఉన్నా కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పరీక్షలు జరగలేదు. స్టీల్ ప్లాంట్ లో మొత్తం 188 ఉద్యోగాల భర్తీ జరగనుంది.

డిసెంబర్ నెల 13, 14 తేదీలలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు త్వరలో స్టీల్ ప్లాంట్ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. గ్యాడ్యుయేషన్ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల ఖాళీలను పరిశీలిస్తే మెకానికల్ బ్రాంచ్ చదివిన వాళ్లకు అత్యధికంగా 77 ఖాళీలు ఉన్నాయి.

ఆ తరువాత ఎలక్ట్రికల్ 45, కెమికల్ 26, మెటలర్జీ 19, సివిల్ 5, సిరామిక్స్ 4, మైనింగ్ కు సంబంధించి 2 ఖాళీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వైజాగ్ స్టీల్ ప్రకటన విడుదల చేసి మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీ చేపడుతుంది. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు ఎంపికైన వారికి భారీ మొత్తంలో వేతనం లభిస్తుంది. అయితే పోస్టులు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఈ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉంటుంది.

సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రశ్నలు కఠినంగా ఉంటాయి కాబట్టి సమాధానాలను ఎంచుకునే విషయంలొ జాగ్రత్త వహిస్తే సులువుగా ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు.

ఏపీ మహిళలకు మరో శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలోని మహిళల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం జగన్ రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్త చెప్పారు. జగన్ సర్కార్ రాష్ట్రంలోని మహిళలకు వైఎస్సార్ చేయూత స్కీమ్ ద్వారా ఇప్పటికే ప్రయోజనం కల్పిస్తుండగా ప్రభుత్వం చేయూత స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన మహిళలకు పాడి పశువులు కొనుగోలు చేసి పంపిణీ చేయాలని భావిస్తోంది.

ఇప్పటికే పశువులు ఉన్న మహిళల నుంచి పాలను అమూల్ ద్వారా కొనుగోలు చేసి, మంచి ధర ఇచ్చి ప్రయోజనం చేకూరేలా చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు వైఎస్సార్ చేయూత స్కీమ్ ద్వారా 18,750 రూపాయలు బ్యాంకు ఖాతాలలో జమ చేసిన సంగతి తెలిసిందే. ఈ నగదుతో ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనుకున్నా, పాడి పశువుల ద్వారా స్థిరపడాలన్నా ప్రభుత్వం తమ వంతు సహాయం చేస్తోంది.

వైఎస్సార్ చేయూత స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన మహిళల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా 4.90 లక్షల మంది మహిళలు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందడానికి దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లలో కొందరు ఇప్పటికే పాడి పశువులు ఉన్నవాళ్లు కాగా మరికొందరు కొత్తగా పాడి పశువుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మొత్తం 5.63 లక్షల పాడి పశువులను కొనుగోలు చేస్తోంది.

జగన్ సర్కార్ రాష్ట్రంలో పాల సేకరణ కేంద్రాలను, బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ కోసం జగన్ సర్కార్ 11 లక్షల రూపాయలు ఖర్చు చేయనుండగా పాల సేకరణ కేంద్రం కోసం 4 లక్షల రూపాయలు ఖర్చు చేయనుంది.