తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. నిర్మాతగా గుర్తింపు పొందిన మాజీ సైనికుడు బెల్లి జనార్ధన్ అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం సినీ వర్గాలను కలచివేసింది.

ఉగాది సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి అత్తగారి ఊరైన కట్టంగూరుకు వెళ్లిన ఆయన, అక్కడ జరిగిన దుర్ఘటనకు గురయ్యారు. సమాచారం ప్రకారం, స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న సమయంలో అనుకోకుండా తల బలంగా పూల్ అడుగున తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
మాజీ సైనికుడిగా దేశానికి సేవలందించిన బెల్లి జనార్ధన్, తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా మారారు. ముఖ్యంగా ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్రంతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సినీ రంగంలో ఇంకా ఎదగాల్సిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని పలువురు భావిస్తున్నారు.
ఆయన స్వగ్రామం నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించారు.
ఈ ఘటనపై చిత్ర దర్శకుడు బాబ్జి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనార్ధన్ ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. సినీ యూనిట్ సభ్యులంతా ఈ విషాదాన్ని తట్టుకోలేకపోతున్నారని ఆయన అన్నారు.
ఈ ఆకస్మిక ఘటనతో తెలుగు సినిమా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.































