మరో కాంట్రవర్సీలో RRR సినిమా !!

0
405

బాహుబలి సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోల కాంబినేషన్ లో తీస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్. తెలుగు ప్రజలకు సుపరిచితులు అయిన అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీం చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల తెలుగు సినిమాలు వరుసగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితమే మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన “వాల్మీకి” సినిమా రిలీజ్ కు ఆరు గంటల ముందే “గద్దలకొండ గణేష్” గా టైటిల్ మార్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజా వివాదం విషయానికి వస్తే ఆర్ ఆర్ ఆర్ సినిమాపై అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా పేరుతో అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తే ఊరుకోమని చెప్పారు. ఇదే అంశంపై నర్సీపట్నం ఆర్డీవోకు వినతపత్రం కూడా ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం జిల్లాలోని పాండ్రంకిలో పుట్టి.. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న బ్రిటీషు సైనికుల కాల్పుల్లో వీరమరణం పొందారు. ఇక కొమురం భీం 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోందని ఆయన తెలిపారు. వీరిద్దరికి స్నేహం ఉందని.. వీరు కలిసి పోరాటం చేశారని చరిత్రలో ఎక్కడా లేదని… అలాంటిది ఇప్పుడు చరిత్రను వక్రీకరించి సినిమా తీయడం రాజమౌళికి తగదని వీరభద్రరావు తన వినతిపత్రంలో పేర్కొన్నారు. అయితే రెండు వేర్వేరు ప్రాంతాలకు… రెండు వేర్వేరు చరిత్రలకు చెందిన ఈ ఇద్దరిని ఏకం చేస్తూ… వీరు కలిసి పోరాటం చేస్తే ఎలా ? ఉంటుందో అనే ఫిక్షన్ కథతో తన సినిమా ఉంటుందని రాజమౌళి ఇదివరకే ప్రకటించిన విషయం అందరికి విదితమే.

ఇక నర్సీపట్నంతో సీతారామరాజుకు విడదీయలేని అనుబంధం ఉన్నందున… భవిష్యత్తులో నర్సీపట్నం కేంద్రంగా జిల్లా ఏర్పడితే దానికి కూడా సీతారామరాజు పేరే పెట్టాలని పేర్కొన్నారు.ఇక రాజమౌళి గతంలో కూడా ఇది కల్పిత కథే అని చెప్పారు. 1920లో అల్లూరి – కొమురం భీం కలిసినట్టు లేదని… కాని వారు కలిసి ఉంటే ఎలా ఉంటుందో ? కథ తయారు చేశానని చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఈ ప్రతిష్టాత్మక భారీ ప్రాజెక్టు పై నెలకొన్న ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here