Krishna – NTR : భారతదేశంలో సినీ రంగం నుంచి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తిగా ఎం.జి.రామచంద్రన్ పేర్కొనవచ్చు. ఆ తర్వాత 1982 ప్రాంతంలో నందమూరి తారక రామారావు సినిమాలలో అగ్ర కథానాయకుడు గా కొనసాగుతూన్న క్రమంలో బడుగు బలహీన వర్గాల్లో ఆశా కిరణంలా రాజకీయరంగంలో ఎన్టీరామారావు అడుగు పెట్టారు. స్థాపించిన అతికొద్ది కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని చేపట్టారు. ఇక ఆయన సినిమాలకి విరామం ప్రకటించారు. పూర్తిగా రాజకీయాలకే పరిమితమై ప్రజల సంక్షేమానికి పాటు పాడడం జరిగింది.

అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో రాణిస్తున్నప్పటికీ ఎంతో మంది రాజకీయ నాయకులు ఆహ్వానించిన రాజకీయ రంగం వైపు ఆయన చూడలేదు. కానీ 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ పిలుపుమేరకు రాజకీయాల్లోకి రావడానికి కృష్ణ గారు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎన్టీ రామారావు కు వ్యతిరేకంగా కొన్ని వ్యంగ్య చిత్రాలను నిర్మించారు. 1986లో పద్మాలయ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సింహాసనం సినిమాలో హీరో కృష్ణ, రాజగురు పాత్ర ధరించిన సత్యనారాయణచే ఎన్టీఆర్ తరచూ చెప్పే..ఇంకేం మిగిలింది బూడిద అనే డైలాగ్ చెప్పించారు.

ఆ తర్వాత ఇదే సంవత్సరంలో పద్మాలయ బ్యానర్ లో పి.చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నా పిలుపే ప్రభంజనం సినిమాను పూర్తిగా ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా రూపొందించారు. ఒకప్పుడు ఎన్టీరామారావుకి డూపు గా వ్యవహరించిన నటుడు కైకాల సత్యనారాయణచే ఎన్టీరామారావు ను పోలిన కోదండ రామయ్య అనే పాత్రను చేయించారు. ఆ తర్వాత నా పిలుపే ప్రభంజనం సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ప్రముఖ దర్శక, నిర్మాత, నటుడు ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో మండలాధీశుడు అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా పూర్తిగా ఎన్టీ రామారావు పై వ్యంగ్యాస్త్రం గా వచ్చింది.

అంత సులువుగా సినిమాలో నటించడానికి ఒప్పుకుని భానుమతి గారు ఈ సినిమాలో ఓ వేషం ధరించడం విశేషం. జమున కూడా మరొక ప్రధాన పాత్ర వేశారు. విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ, నరేష్, వాణి విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా మళ్లీ ఎన్టీరామారావు పై ఓ సెటైరికల్ మూవీగా ‘సాహసమే నా ఊపిరి’ సినిమా వచ్చింది. ఆ తర్వాత 1989 లో ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో విజయనిర్మల, నరేష్ ప్రధానపాత్రలో గండిపేట రహస్యం సినిమా విడుదలైంది.

ఇది కూడా ఎన్టీరామారావును ఆధారం చేసుకొని తీసిన ఓ వ్యంగ్య చిత్రంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కృష్ణ బావమరిది సూర్యనారాయణ బాబు నిర్మాణ సారధ్యంలో ప్రదీప్ శక్తి దర్శకత్వంలో బాలచందర్ ప్రధాన పాత్రలో ’కలియుగ విశ్వామిత్ర’ సినిమాని ఎన్టీరామారావు పై మరో వ్యంగ్యాస్త్రంగా విడుదల చేశారు.































