కోట శ్రీనివాసరావు.. విలక్షణ నటుడు. నాలుగు దశాబ్దాల సినిమా అనుభవం ఉంది ఆయనకు. తన కెరీర్ లో వందల సినిమాల్లో నటించారు. చాలా సినిమాల్లో ఆయన క్యారెక్టర్ కోసమే సినిమాలు చూసేవారు జనాలు. ప్రతిఘటన సినిమాలోని కాసయ్య క్యారెక్టర్ కావచ్చు.. ఇంకేదైనా కావచ్చు.. కోట శ్రీనివాసరావు నటనను మించినవాళ్లు లేరు. విలనిజం పండించాలన్నా.. కామెడీని పండించాలన్నా కోట తర్వాతనే ఎవ్వరైనా. కోట శ్రీనివాసరావు అనే వ్యక్తి.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పిల్లర్. ఆయన సినిమా కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు కోట శ్రీనివాసరావు.

అయితే.. కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారు? ఆయన నేపథ్యం ఏంటి? అనే విషయాలు చాలామందికి తెలియదు. ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారో కూడా చాలామందికి తెలియదు. అయితే.. కోట శ్రీనివాసరావు గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
బ్యాంకు ఉద్యోగిగా పనిచేసిన కోట శ్రీనివాసరావు

కోట శ్రీనివాసరావు తన చదువు పూర్తయ్యాక.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేశారట. బ్యాంకు ఉద్యోగిగా చేస్తున్నప్పుడే నాటకాలు అంటే ఆసక్తి ఏర్పడి.. నాటకాలు వేసేవారట. అలా.. నాటకాలు వేస్తూ వేస్తూ.. తన టాలెంట్ ను నిరూపించుకున్నారు కోట శ్రీనివాసరావు. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు. సినిమాల్లోకి వచ్చాక బిజీ ఆర్టిస్ట్ అయ్యాక తన ఉద్యోగాన్ని వదిలేశారు.
తన నాటకం చూసి వందేమాతరం సినిమాలో చాన్స్

కోట శ్రీనివాసరావు.. అప్పుడప్పుడు నాటకాలు వేస్తుండేవారు. ఆయన నాటకాలను చాలామంది దర్శకులు, నిర్మాతలు చూస్తుండేవారు. ఒక సారి.. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో మీరైతే ఏం చేస్తారు? అనే నాటకం వేశారట కోట. తన నాటకాన్ని చూసిన డైరెక్టర్ టీ కృష్ణ.. కోట శ్రీనివాసరావుకు వందేమాతరం సినిమాలో చాన్స్ ఇచ్చారట. ఆ తర్వాత ప్రతిఘటన సినిమాకు కాసయ్య అనే పాత్ర రావడం.. ఆ తర్వాత కోట వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదట.
కోట శ్రీనివాసరావు నాన్న ఏం చేసేవారంటే?

కోట శ్రీనివాసరావుది ఏపీలోని కృష్ణా జిల్లాలోని కంకిపాడు. కోట శ్రీనివాసరావు వాళ్ల నాన్న డాక్టర్ గా పనిచేసేవారు. తన అన్నను చూసి నాటకాల్లోకి వెళ్లాలని అనుకున్నారు కోట శ్రీనివాసరావు. అలా సినిమాల్లోకి వెళ్లారు. అలా వెనక్కి తిరిగి చూసుకోకుండా.. వందల సినిమాల్లో నటించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అయితే.. కోట శ్రీనివాసరావుకు పాలిటిక్స్ అంటే అస్సలు పడవట. కాకపోతే తనకు బీజేపీ పార్టీ అంటే చాలా ఇష్టమట. వాజ్ పేయి అంటే కోట శ్రీనివాసరావుకు అభిమానం అట. కానీ.. పాలిటిక్స్ ను పెద్దగా పట్టించుకోనని చెప్పుకొచ్చారు కోట శ్రీనివాసరావు.

అయితే.. తనకు కెరీర్ మొదట్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ వేసినప్పుడు ఆయనకు చాలా సమస్యలు వచ్చాయట. ఓ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ వేశారు కోట శ్రీనివాసరావు. ఆ తర్వాత ఆయనకు ఇండస్ట్రీలో చాలా సమస్యలు వచ్చాయట. ఒక సంవత్సరం పాటు ఆయన్ను ఇండస్ట్రీ నుంచి కొన్ని వర్గాలు వెలివేశాయట. చాలామంది సమస్యలు సృష్టించారట. ఆ తర్వాత నెమ్మదిగా మళ్లీ అవకాశాలు వచ్చాయట.































