ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్లో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. లోనీ ప్రాంతంలోని పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ బ్రాంచ్‌లో సెక్యూరిటీ గార్డు తన మేనేజర్‌పై కాల్పులు జరపడం విషాదానికి దారితీసింది.

పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు అభిషేక్ శర్మగా గుర్తించారు. అతను గత కొంతకాలంగా ఆ బ్రాంచ్‌లో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నిందితుడు రవీంద్ర హూడా ఇటీవలే అక్కడ ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. సెలవు అంశంపై ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయని తెలిసింది.
సోమవారం మధ్యాహ్నం కూడా అదే విషయంపై బ్యాంకులో వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో కోపంతో రవీంద్ర హూడా తన వద్ద ఉన్న సర్వీస్ గన్‌తో మేనేజర్‌పై కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా తుపాకీ శబ్దం వినిపించడంతో అక్కడ ఉన్న సిబ్బంది, కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు.
గాయపడిన మేనేజర్‌ను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.




























