తెలంగాణలో వేసవి ప్రారంభంలోనే తీవ్ర ఎండలు వేధిస్తున్న వేళ, వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

ప్రస్తుతం ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ దిశగా విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా మంగళవారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. బుధవారం, గురువారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత కొంత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గాలివానలతో పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
అలాగే ఈ వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు కూడా కొంత మేర తగ్గనున్నాయి. వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోవచ్చని అంచనా. దీంతో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.
ఇక గాలుల విషయానికి వస్తే, కొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. గురువారం నాటికి ఈ గాలుల వేగం మరింత పెరిగి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు చేరొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అవసరమైతే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.



























