మన వంటగదిలో ఉండే చిన్న చిన్న మసాలా దినుసుల్లోనే ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాలకులు. వంటకాలకు సువాసన, రుచిని పెంచే ఈ చిన్న గింజ, ఆరోగ్య పరంగా కూడా అద్భుత ప్రయోజనాలు అందిస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరాన్ని కాపాడే సహజ ఔషధంగా పనిచేస్తుంది.

యాలకులకు సహజంగా శరీరాన్ని చల్లబరచే గుణం ఉంటుంది. వేసవిలో బయటకు వెళ్లే ముందు ఒక యాలకును నోట్లో వేసుకుని నమిలితే, దాని రసం శరీరాన్ని లోపల నుంచి చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. వడదెబ్బ, అధిక వేడి వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించడంలో ఇది చిన్న కానీ ప్రభావవంతమైన చిట్కా.
నోటి పూతల సమస్యతో బాధపడేవారికి కూడా యాలకులు మంచి ఉపశమనం ఇస్తాయి. కడుపులో వేడి లేదా జీర్ణ సమస్యల కారణంగా వచ్చే పూతలను తగ్గించడంలో యాలకులలోని యాంటీబాక్టీరియల్ గుణాలు సహాయపడతాయి. యాలకుల పొడిని తేనెతో కలిపి పూత ఉన్న చోట రాస్తే త్వరగా నొప్పి తగ్గుతుంది.
అలాగే, వాతావరణ మార్పులతో వచ్చే దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు కూడా యాలకులు ఉపయోగపడతాయి. యాలకుల పొడిని వేడి నీటిలో కలిపి తాగితే గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. శ్వాసకోశానికి సంబంధించిన సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
జీర్ణక్రియ విషయంలో కూడా యాలకులు కీలక పాత్ర పోషిస్తాయి. భారమైన భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తే ఒక యాలకును నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గించడంలో ఇది సహజమైన పరిష్కారంగా పనిచేస్తుంది.
నోటి దుర్వాసన సమస్యకు కూడా యాలకులు మంచి మందు. ఇవి సహజ మౌత్ ఫ్రెషనర్‌లా పనిచేసి, నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించి తాజా వాసనను ఇస్తాయి. దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడతాయి.
మొత్తానికి, యాలకులు కేవలం వంటలో వాడే మసాలా దినుసు మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడే చిన్న సహజ ఔషధం. రోజువారీ జీవితంలో ఒక యాలకును అలవాటు చేసుకుంటే, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు





























