తెలంగాణలో మహిళల సంక్షేమంపై ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేసే రెండో విడత కార్యక్రమాన్ని మార్చి 1 నుంచి ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. మహిళా శక్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరింత వేగం అందుకోనుంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే లక్షలాది మహిళలకు చీరలు అందజేశారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించారు. సుమారు 35 లక్షల మహిళలకు చీరలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఎన్నికల కారణంగా నిలిచిపోయిన కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నారు. గతంలో ఐదు లక్షల చీరలు అందించగా, ఈ విడతలో దాదాపు 30 లక్షల చీరలు పంపిణీ చేయనున్నారు.
మొదట స్వయం సహాయక సంఘాల మహిళలకు మాత్రమే ఈ సదుపాయం ఇవ్వాలని భావించిన ప్రభుత్వం, తరువాత 18 ఏళ్లు పూర్తి చేసిన ప్రతి మహిళకు అందించాలని నిర్ణయించింది. దీంతో మరింత మంది లబ్ధిదారులు ఈ పథకం కిందకి రానున్నారు.
ఇది కేవలం సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాకుండా చేనేత రంగానికి ఊతమివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం నేరుగా నేసిన చీరలను కొనుగోలు చేస్తోంది. సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండ తదితర ప్రాంతాల్లో తయారైన ఈ చీరలతో వేలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తోంది. ఒక్కో చీర తయారీకి సుమారు రూ.480 ఖర్చవుతుందని సమాచారం. రెండు దశల్లో కలిపి కోటి మంది మహిళలకు చీరలు అందించేందుకు ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.
ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాకుండా, స్థానిక చేనేత పరిశ్రమకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చీరల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగేందుకు మెప్మా, సంబంధిత శాఖలు సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నారు.































