జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. చత్రూ అడవీ ప్రాంతంలో నక్కిన వారిని తుదముట్టించడానికి ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF బలగాలు సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ట్రాషి-I’ సక్సెస్‌గా ముగిసింది. భద్రతా బలగాలు పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ, ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసి, అటవీ భద్రతను పెంచారు.

ఇంటెలిజెన్స్ సమాచారానికి అనుగుణంగా, సైన్యం చత్రూ బెల్ట్‌లోని దట్టమైన అడవీ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఉదయం 11 గంటలకు భద్రతా బలగాలు గాలింపు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు వెంటనే ప్రతిఘటనగా ఎదురుకాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే మరణించారు. భద్రతా వర్గాలు ఒకరు జైషే మహమ్మద్ మోస్ట్ వాంటెడ్ కమాండర్ సైఫుల్లా అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సైఫుల్లా గత కొన్ని వారాలుగా ఈ ప్రాంతంలో భద్రతా బలగాలపై దాడులు నిర్వహిస్తూ తప్పించుకుంటూ తిరుగుతున్నాడని తెలిపారు. ఘటన స్థలంలో రెండు AK-47 రైఫిల్స్, భారీగా పేలుడు పదార్థాలు, యుద్ధ సామాగ్రి స్వాధీనం అయ్యింది.
కిష్త్వార్ అటవీ ప్రాంతంలో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. జనవరి 18న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక పారా కమాండో వీరమరణం పొందగా, ఎనిమిది మంది సైనికులు గాయపడ్డారు. మంచు కురుస్తున్న, క్లిష్ట భౌగోళిక పరిస్థితుల మధ్య కొనసాగిన ‘ఆపరేషన్ ట్రాషి-I’ తాజా విజయంతో స్థానిక ఉగ్రవాద నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ తగిలినట్లు అధికారులు వెల్లడించారు.



































