దేశంలో ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. భారత్ లో సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి ఇంకెంత కాలం పడుతుందో తెలీదు. మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం మనిషి జీవితంలో భాగమైపోయాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల వల్ల ప్రాజెక్టులు తగ్గాయి. కొత్త ఉద్యోగాల కల్పన సంగతి పక్కన పెడితే ఉన్న ఉద్యోగులనే తొలగిస్తున్న పరిస్థితి నెలకొంది. పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉండటంతో ఉద్యోగులు పడుతున్న బాధ వర్ణణాతీతం.

పలు కంపెనీలు ఉద్యోగులకు రెండు, మూడు నెలల ముందస్తు వేతనాలు చెల్లించి ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. మిగతా కంపెనీలలాగా ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ యాక్సెంచర్ సైతం ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సిద్ధమైంది. కంపెనీలో ఉన్న ఉద్యోగులలో 5 శాతం ఉద్యోగులకు తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అయితే మిగతా కంపెనీల్లా కాకుండా ఉద్యోగాలు వదులుకునే వారికి 7 నెలల వేతనం చెల్లించడానికి కంపెనీ సిద్ధపడటం గమనార్హం. చాలా ఐటీ కంపెనీలు ఉద్యోగాలు వదులుకున్న వారికి ఇస్తున్న మొత్తంతో పోలిస్తే 7 నెలల వేతనం అంటే పెద్ద మొత్తం కావడం గమనార్హం. టెక్నాలజీకి తక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో 5 శాతం ఉద్యోగాల్లో కోత విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనా ఉధృతి నేపథ్యంలో ఉద్యోగాల్లో కోత విధిస్తున్న కంపెనీ ప్రతి సంవత్సరం ఉద్యోగాల కోత సహజమేనని చెబుతోంది.
యాక్సెంచర్ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో నైపుణ్యం లేని వాళ్లు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. టెక్నాలజీకి డిమాండ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగులను తొలగించి ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను పెంచనున్నట్టు తెలుస్తోంది.





























