హైదరాబాద్: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరోయిన్ శ్రీలీల. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు, మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత రెండో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని, వరుస అవకాశాలతో దూసుకుపోయింది. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించి, తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లకు పోటీనిచ్చింది. దీంతో అగ్ర హీరోలు సైతం ఈ బ్యూటీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించారు.

కానీ, గత కొంతకాలంగా శ్రీలీల నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తున్నాయి. వరుస ప్లాపులతో సతమతమవుతోంది. అలాగే కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకోవడం కూడా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, వరుస ప్లాపులు వస్తున్నప్పటికీ ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గట్లేదని టాక్ వినిపిస్తోంది.
“ధమాకా” సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న శ్రీలీల, ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించినా హిట్టు అందుకోలేకపోయింది. సినిమాలతో పాటు స్పెషల్ పాటలతోనూ రచ్చ చేస్తోంది. ఇటీవల అఖిల్ సరసన నటించాల్సిన “లెనిన్” మూవీ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు, “వైరల్ వయ్యారి” అంటూ ఓ ప్రత్యేక పాటతో నెట్టింట సంచలనం సృష్టించింది. ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న “జూనియర్” సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, జెనీలియా కీలకపాత్రలో నటిస్తున్నారు.
భారీగా పెరిగిన పారితోషికం?
వరుస ప్లాపులతో సతమతమవుతున్నప్పటికీ, శ్రీలీల తన రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఒక్కో సినిమాకు తన పారితోషికం డబుల్ చేసిందని టాక్ వినిపిస్తుంది. గతంలో ఒక సినిమాకు రూ. 2 కోట్లు పారితోషికం తీసుకున్న శ్రీలీల, ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.



























