Analyst Damu Balaji : వర్గ పోరు రాజకీయ ప్రత్యర్థుల కన్నా ఒకే కుటుంబంలోని వ్యక్తుల మధ్య రాజకీయ కుటుంబాల్లో ఎక్కువగా ఉంటుంది. అలాంటి వర్గ పోరు ఫ్యాక్షన్ నేల అయిన సీమలో అందులోనూ ఆళ్లగడ్డ రాజకీయాల్లో నేడు చూస్తున్నాం. తల్లిదండ్రులు ఇద్దరూ ఆకస్మికంగా వదిలి వెళ్లినా, కుటుంబ బాధ్యతలను వారి వారసత్వంగా అబ్బిన రాజకీయాలను చేస్తూ భూమా అఖిల ప్రియా రెడ్డి చిన్న వయసులోనే టీడీపీ తరుపున మంత్రి కూడా అయింది. అయితే తండ్రి భూమా నాగిరెడ్డి ఉన్నంత వరకు ఆయనకు రైట్ హ్యాండ్ గా నిలిచిన మామ ఏవి సుబ్బారెడ్డి తో ఇప్పుడు గొడవ పడుతోంది అఖిల ప్రియ. ఇక ఈ వర్గ పోరు ఎలా మొదలయింది వంటి అంశాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

లోకేష్ పాదయాత్రలో కొట్టుకున్న ఇరువర్గాలు…
భూమా కుటుంబం ఆళ్లగడ్డ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎపుడూ కలిసి ఉండే వాళ్ల మధ్య ఇపుడు వర్గ పోరు మొదలయింది. కొట్టుకునే వరకు వెళ్లిపోయారు. భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రాం ద్వారా సుపారీ ఇచ్చి మామ ఏవి సుబ్బారెడ్డి ని చంపించాలని ప్లాన్ కూడా చేసినట్లు తెలుస్తోంది అంటూ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. తండ్రి మరణించాకే వీరి మధ్య విబేధాలు వచ్చాయని తెలిపారు బాలాజీ. తాజాగా ఆళ్లగడ్డ వద్దకు లోకేష్ పాదయాత్ర చేరుకున్న సందర్బంగా 101 రోజు కావడంతో సంఘీభావంగా టీడీపీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీ లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

భూమా అఖిల ప్రియ ముందే అటు వర్గం మీద దాడులు నిర్వహించి బాగా కొట్టారు. ఆ కొట్టిన వీడియో బయటికి రావడంతో టీడీపీ పార్టీ ఈ విషయం మీద అచ్చంనాయుడు ఆధ్వర్యంలో కమిటీ కూడా వేసింది అంటూ బాలాజీ తెలిపారు. అయితే దగ్గరుండి అఖిల ప్రియ ఇలా చేయించిందనే ఆరోపణలు నడుమ నా చున్నీ లాగడంతో మా వాళ్ళు వారి మనిషి మీద దాడి చేసారంటూ అఖిల ప్రియ చెప్పుకొచ్చింది. అయితే వీడియోలో అవేవి లేవు, కేవలం వారిని అఖిలప్రియ తరుపు మనుషులు కొట్టడం మాత్రమే ఉంది అంటూ చెప్పారు బాలాజీ. ఇక లోకేష్ ముందు బల ప్రదర్శన కోసమే ఇలా గొడవ జరిగిందని తెలుస్తోందని బాలాజీ అభిప్రాయపడ్డారు.