టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నప్పటికీ, కొన్ని సంఘటనలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఓ రోబో చేసిన చర్యతో పోలీసులు దానిని అదుపులోకి తీసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విచిత్ర సంఘటన మకావులో చోటుచేసుకుంది.

స్థానిక సమాచారం ప్రకారం, సుమారు 70 ఏళ్ల వృద్ధురాలు సాయంత్రం సమయంలో రోడ్డుపై నడుస్తూ ఉండగా, ఓ హ్యూమనాయిడ్ రోబో ఆమెను వెనుక నుంచి అనుసరించింది. ఫోన్‌లో నిమగ్నమై నడుస్తున్న ఆమెకు ఇది తొలుత గమనించలేదు. అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసినప్పుడు రోబో దగ్గరగా కనిపించడంతో తీవ్ర భయానికి గురయ్యారు.
అనూహ్యంగా ఎదురైన ఈ పరిస్థితితో ఆమె గట్టిగా కేకలు వేస్తూ భయంతో వణికిపోయారు. రోబో తన వెంట ఎందుకు వస్తోందో అర్థంకాక ఆందోళనకు గురైన ఆమె, దాని ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటన కారణంగా ఆమెకు తీవ్ర షాక్ తగిలి ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, ఆ రోబోను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
ఈ సంఘటన టెక్నాలజీ వినియోగంపై మరోసారి చర్చకు దారితీసింది. రోబోలు, కృత్రిమ మేధస్సు వినియోగంలో భద్రతా ప్రమాణాలు ఎంత ముఖ్యమో నిపుణులు గుర్తుచేస్తున్నారు. ప్రజల భద్రతకు భంగం కలిగించేలా ఎలాంటి సాంకేతిక పరికరాలు ఉపయోగించకూడదని సూచిస్తున్నారు.




























