General News

వామ్మో.. స్మార్ట్ ఫోన్ తో తండ్రి ఖాతా ఖాళీ చేసిన బాలుడు!

Published

on

దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో భౌతికంగా పాఠశాలలను నిర్వహించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దీంతో చదువులు ఆన్ లైన్ బాట పట్టాయి. పల్లెల నుంచి పట్టణాల వరకు స్మార్ట్ ఫోన్ల ద్వారానే క్లాసుల నిర్వహణ జరుగుతోంది. అయితే చదువుల కోసం విద్యార్థులకు కొనిచ్చిన స్మార్ట్ ఫోన్లను విద్యార్థులు వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుంటూ ఉండటం గమనార్హం.  

దీంతో సైబర్ నేరగాళ్లు చిన్నపిల్లలను టార్గెట్ చేస్తున్నారు. విద్యార్థులకు ఆన్ లైన్ గేమ్స్ ను ఎరగా వేసి ఖాతాలలో డబ్బులను కాజేస్తున్నారు. ఏ పాపం తెలియని పిల్లలు ఖాతాలలో డబ్బులు ఖాళీ అవుతూ ఉండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో మానసిక వేదనకు గురవుతున్నారు. పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నా విద్యార్థులకు వాటి గురించి అర్థం చేసుకునే సామర్థ్యం లేదు.  

దీంతో క్షణాల వ్యవధిలో ఖాతాలలో డబ్బులు మాయమవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిదేళ్ల బాలుడి నిర్లక్ష్యం వల్ల ఖాతాలో రెండున్నర లక్షలు మాయమయ్యాయి. బాలుడు సరదాగా ఆడే ఆన్ లైన్ గేమ్స్ వల్ల ఖాతాలలో డబ్బులు మంచినీళ్లలా ఖర్చైపోయాయి. బాలుడు మోసగాళ్లు తయారు చేసిన ఆన్ లైన్ గేముల్లో రివార్డ్ పాయింట్ల కోసం డబ్బు ఖర్చు చేశాడని తెలియడంతో షాక్ అవ్వడం తండ్రి వంతయింది.  

Advertisement

రెండున్నర లక్షల రూపాయలు ఉన్న ఖాతాలో చివరకు 500 రూపాయలు మాత్రమే మిగిలాయి. దీంతో తండ్రి కొడుకుకు చేసిన తప్పు గురించి వివరించి సున్నితంగా మందలించాడు. సైబర్ క్రైమ్ పోలీసులు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొని ఇస్తే ఆ మొబైల్స్ ద్వారా బ్యాంక్ లావాదేవీలు జరిగే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.

Advertisement

Trending

Exit mobile version