సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్తతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది. ఆయన మరణ వార్తతో పలువురు ప్రముఖులతో పాటు, కుటుంబ సభ్యులు కూడా బోరున విలపిస్తున్నారు. సిరివెన్నెల మరణం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక తీరని లోటు అని చెప్పవచ్చు. అయితే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల మళ్లీ మామూలు మనిషిగా తిరిగి వస్తారు అని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా అతను అనంత లోకాలకు వెళ్లిపోయారు.

ఆయన మరణవార్త విన్న పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను కడసారిగా చూసుకునేందుకు భారీగా ప్రముఖులు ఫిలిం ఛాంబర్ కు తరలిస్తున్నారు. సీతారామశాస్త్రి భౌతికకాయన్ని బుధవారం అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకుని ఆయన పార్థివదేహానికి కన్నీటి నివాళులు అర్పించారు.
టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీయార్, జగపతిబాబు, నాగబాబు, శ్రీకాంత్, రాజశేఖర్, అల్లు అర్జున్, నాని, రానా దగ్గుబాటి, శర్వానంద్ ఇంకా పలువురు ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఇక రాజమౌళి, కీరవాణి, మణిశర్మ, గుణశేఖర్, క్రిష్ జాగర్లమూడి, మారుతి, పరుచూరి గోపాలకృష్ణ, ఆచంట గోపీనాథ్, ఎస్వీ కృష్ణారెడ్డి, కే అచ్చిరెడ్డి, తనికెళ్ల భరణి, రావు రమేష్ ఆయనను కడసారిగా చూసేందుకు తరలి వచ్చారు.
అలాగే నిర్మాతలు అల్లు అరవింద్, ప్రసాద్, కేఎల్ నారాయణ, చోటా కే నాయుడు, సింగర్ సునీత తదితరులు సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు సిరివెన్నెల తో తమకున్న జ్ఞాపకాలను, అనుబంధాలను గుర్తు చేసుకుని మరీ ఎమోషనల్ అవుతున్నారు.సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతిమ యాత్ర బుధవారం మధ్యాహ్నం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.




























