Chalapati rao :తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది వర్ష విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు అనారోగ్య సమస్యల కారణంగా మరణించడంతో ఇండస్ట్రలో విషాద ఛాయలు అలముకున్నాయి. కృష్ణంరాజు, కృష్ణ, మొన్న నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతిని మరువక ముందే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చలపతిరావు (79) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

తెలుగు సినిమాలలో మొదట్లో విలన్ గాను ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఎన్నో సినిమాల్లో చేసిన చలపతిరావు గారు అటు స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి నేటి తరం జూ.ఎన్టిఆర్ వరకు మూడుతరాల హీరోలతో కలిసి నటించారు. 1966లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చలపతి రావు అప్పటినుంచి దాదాపు 1200లకు పైగా సినిమాల్లో పలు విభిన్న పాత్రల్లో నటించారు.

కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు ఆయన స్వస్తలం. తండ్రి మణియ్య. తల్లి వియ్యమ్మ. 1944 మే 8న చలపతిరావు పుట్టారు. చలపతి రావు గారి కుటుంబం వ్యవసాయిక కుటుంబం. నాటకాలు, సినిమాల మీద మక్కువతో చలపతి రావు గారు సినిమాల్లోకి వచ్చారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు.. ఆయన తనయుడు రవి బాబు కూడా సినిమా ఇండస్ట్రీలోనే డైరెక్టర్ గా స్థిరపడ్డారు. ఇలా ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన సేవలను చేసినటువంటి చలపతిరావు మరణ వార్త తెలుసుకున్నటువంటి సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.































