Choreographer Suchithra Chandhrabose : డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సుచిత్ర చంద్రబోస్. చెన్నైలో పుట్టిపెరిగిన సుచిత్ర డాన్స్ నేర్చుకుని మొదట రఘు మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసారు. ఇక అంతకంటే ముందు ఇంట్లోవాళ్లకు తెలియకుండా గ్రూప్ డాన్సర్ గా కూడా పనిచేసి ఆ తరువాత టాలెంట్ తో డాన్స్ మాస్టర్ గా ఎదిగిన సుచిత్ర గారు పాటల రచయిత చంద్రబోస్ గారిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. పెళ్లి తరువాత కూడా కెరీర్ ను కొనసాగించిన సుచిత్ర గారు తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ కి సంబంధిచిన విషయాలను పంచుకున్నారు.

చిరంజీవి గారు ఆ సినిమాల్లో వెంటనే అవకాశం ఇచ్చారు…
సుచిత్ర గారిది ఆంధ్రప్రదేశ్ అయినా తండ్రి సినిమా రంగంలో ఉండటం వల్ల చెన్నైలోనే స్థిరపడ్డారు. ఇక సుచిత్ర గారి ఇంటి పైన చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ గారు మొదట్లో రూమ్మేట్స్ గా ఉండేవారట. అప్పుడు చిన్నపిల్లగా ఉన్న తనతో మాట్లాడేవారంటూ సుచిత్ర గత విషయాలను పంచుకున్నారు. ఇక కొబ్బరి బోండం సినిమాతో కొరియోగ్రాఫర్ అయి పలు సినిమాలకు చేస్తున్న సమయంలో ఒకసారి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి వెళ్లగా అక్కడే పక్కన రాఘవేంద్ర రావు గారు చిరంజీవి కాంబినేషన్ లో ‘ఘరానా మొగుడు’ సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఒకసారి వెళ్లి చిరంజీవి గారిని కలిసి నేను కొరియోగ్రాఫర్ అయ్యానని చెప్పి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని వెళ్ళాను అంటూ సుచిత్ర చిరంజీవి గారి గురించి వివరించారు. ఆయన కాళ్లకు దండం పెట్టి నేను కొరియోగ్రాఫర్ అయ్యానని చెప్పగానే ఆ చిన్న పాప ఇప్పుడు డాన్స్ మాస్టర్ అయ్యిందా అని చాలా ఆశ్చర్య పోయారు చిరంజీవి. వెంటనే ఘరానా మొగుడు సినిమాలో ‘హే పిల్ల హలో పిల్ల’ సాంగ్ కి కోరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చారట. ఇక ఆ సినిమా తరువాత కెరీర్ లో అగ్ర హీరోలతో కలిసి పనిచేశానంటూ సుచిత్ర తెలిపారు.































