Comedian Ramana Reddy : తిక్కవరపు రమణా రెడ్డి గారు తెలుగు సినిమా తొలి తరం కమెడియన్. బక్క పలచని దేహంతో నెల్లూరు యాసతో మాట్లాడుతూ హాస్యాన్ని పండించిన వ్యక్తి. రమణా రెడ్డి గారు ఎన్నో సినిమాల్లో అప్పటి ప్రేక్షకులకు హాస్యపు రుచిని చూపించారు. అయితే ఆయన తరువాత ఆయన వారసులుగా ఎవరూ ఇండస్ట్రకి రాకపోవడం వల్ల ఆయన వ్యక్తిగత వివరాలు, ఆయన కుటుంబం ఎలా ఉంది అన్న విషయాలు చాలా మందికి తెలియదు. ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన దూరపు బంధువు శ్రీనివాస రెడ్డి గారు ఆయన కుటుంబం గురించి రమణా రెడ్డి గారి గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ సినిమాల్లోకి…
ఇందుకూరు మండలం జగధీర్ పేట లో పుట్టి పెరిగిన తిక్కవరపు రమణా రెడ్డి గారు ప్రాథమిక విద్య అక్కడే అభ్యసించిన ఆ తరువాత నెల్లూరు వెళ్లారు. అక్కడే చదువుకుని శానిటరీ ఇన్స్పెక్టర్ గా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన ఆయన నాటకాలను వేసేవారు. అలా సినిమా మీద ఆసక్తి పెరిగి సినిమాల్లో అవకాశాల కోసం మద్రాస్ వెళ్లారు. అక్కడ అవకాశాలు బాగా వచ్చాక ఉద్యోగం మానేసి కుటుంబాన్ని మద్రాస్ కి మార్చారు. రమణా రెడ్డి గారికి ఐదుగురు సంతానం. పెద్ద కొడుకు ప్రభాకర్ రెడ్డి మద్రాస్ లోనే స్థిరపడగా, ఒక కూతరు లండన్ లో, ఒక కూతురు నెల్లూరులోనే స్థిరపడ్డారు.

ఇక మరో కొడుకు అమెరికాలో స్థిరపడగా మరో కూతురు మద్రాస్ లో స్థిరపడ్డారంటూ ఆయన దూరపు బందువు శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు. సినిమాల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్నాక సొంతూరుకి ఎపుడైనా వచ్చేవారని ఇప్పటికీ జగధీర్ పేటలో భూములు ఉన్నాయని తెలిపారు. పిల్లలు బాగా చదువుకుని బాగా స్థిరపడ్డారని వారికి సినిమాల్లోకి రావాలనే ఇష్టం లేకపోవడం వల్ల రాలేదంటూ తెలిపారు. ఇక రమణా రెడ్డి గారి అన్న కొడుకు టీ సుబ్బిరామి రెడ్డి గారు మాజీ ఎంపీ మరియు సినిమా నిర్మాత.



























