రైల్వే టికెట్ క్యాన్సిలేషన్, రీఫండ్ నిబంధనల్లో మార్పులపై జరుగుతున్న ప్రచారానికి భారతీయ రైల్వే శాఖ కీలక స్పష్టత ఇచ్చింది. ఈ మార్పులు ప్రయాణికులకు అదనపు భారం కాదని, వారి సౌకర్యం కోసం తీసుకున్న చర్యలేనని అధికారికంగా వెల్లడించింది.

ప్రస్తుతం అమలు చేస్తున్న సంస్కరణల్లో భాగంగా, ప్రయాణికులకు ముందుగానే తమ టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అన్న విషయంపై స్పష్టత కల్పించే విధంగా చార్ట్ తయారీ సమయాన్ని పెంచినట్లు రైల్వే శాఖ తెలిపింది. గతంలో రైలు బయలుదేరే సమయానికి నాలుగు గంటల ముందు చార్ట్ సిద్ధం చేసేవారు. ఇప్పుడు దాన్ని 9 నుంచి 18 గంటల ముందుగానే సిద్ధం చేసేలా మార్పులు చేశారు. దీని వల్ల దూర ప్రాంతాల నుంచి ప్రయాణించే వారికి ముందుగానే సమాచారం అందుతుంది.
ఇక రీఫండ్ నిబంధనల్లో మార్పులు చేశారని వస్తున్న వార్తలపై కూడా శాఖ క్లారిటీ ఇచ్చింది. ప్రయాణికులపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించలేదని స్పష్టం చేసింది. టికెట్ రద్దు ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడమే ఈ మార్పుల ఉద్దేశమని పేర్కొంది.
అక్రమ టికెట్ ఏజెంట్ల నియంత్రణలో కూడా ఈ మార్పులు సహాయపడతాయని అధికారులు తెలిపారు. టికెట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడం ద్వారా దుర్వినియోగాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు.
మరో ముఖ్యమైన మార్పుగా, ప్రయాణికులు ఇప్పుడు రైలు బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందు వరకు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే అవకాశం కల్పించారు. అలాగే సీట్లు ఖాళీగా ఉంటే, అదే గడువులో బోగి అప్‌గ్రేడ్ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
మొత్తంగా, ఈ మార్పులు ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా మార్చడానికే తీసుకున్న నిర్ణయాలని రైల్వే శాఖ మరోసారి స్పష్టం చేసింది. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మేరకు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని ప్రయాణికులకు సూచించింది.





























