దేశవ్యాప్తంగా కరోనా మొదటి దశ వ్యాప్తి చెందినప్పుడు వ్యాధి తీవ్రత కేవలం వయసు పైబడిన వారిలోనే చూపించింది. యుక్తవయసు వారిలో చిన్న పిల్లల్లో ఈ వ్యాధి తీవ్రత పెద్దగా కనిపించలేదు. దీంతో వయసు పైబడినవారు కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు.ఈ క్రమంలోనే కొన్ని నెలల అనంతరం కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో యధావిధిగా ప్రజలందరూ ఏమాత్రం కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరించడం వల్ల కరోనా వైరస్‌లో కొత్త మ్యుటేషన్లు పుట్టుకొచ్చాయి.

ప్రస్తుతం కరోనా వైరస్ రెండవ దశ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. రెండవ దశ వయసు వారిలోనే కాకుండా చిన్న పిల్లలలో కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలోనే చిన్నపిల్లలలో కూడా కరోనా వైరస్ లక్షణాలు కనిపించి మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే పిల్లలలో కరోనా లక్షణాలు ఏమిటి?లక్షణాలు కనిపిస్తే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేక మార్గాలు, మార్గదర్శకాలతో కూడిన జాబితాను విడుదల చేసింది.
కరోనా బారిన పడిన పిల్లలలో జ్వరం, జలుబు, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో వాంతులు-విరేచనాలు, కండరాల నొప్పి, ముక్కు నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనబడితే తప్పకుండా అది కరోనా అని భావించాలి. చిన్నపిల్లలలో నొప్పి ఎక్కువగా ఉంటే వారు చెప్పలేరు కనుక ఎక్కువగా ఏడుస్తుంటారు.
ఈ విధమైన లక్షణాలు కనిపించిన పిల్లలు కరోనా బారిన పడి ఉంటారు. అయితే చిన్న పిల్లలు కరోనా నుంచి తొందరగా కోలుకుంటారని కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరికొందరిలో ఎటువంటి లక్షణాలు కనబడకుండా వారు కరోనా బారినపడి ఉంటారు.ఈ విధమైన లక్షణాలు లేకుండా కరోనాకు గురైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచి చికిత్స అందించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.



























