బెంగళూరులో దారుణమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్నతల్లే తన ఐదేళ్ల చిన్నారిని ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఈ కేసు మూడు నెలల తర్వాత చిన్నారి తండ్రి ఫిర్యాదుతో బయటపడింది.

దావణగెరెకు చెందిన ప్రవీణ్‌కు బెంగళూరుకు చెందిన ప్రియాంకతో వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొన్నేళ్ల తర్వాత ప్రియాంకకు తన పాత స్నేహితుడు మోహన్‌తో మళ్లీ పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. అనంతరం ఆమె భర్తతో దూరంగా ఉంటూ ప్రియుడితో కలిసి జీవించడం ప్రారంభించింది. చిన్న కుమార్తె వెన్నిల మాత్రం తల్లితోనే ఉండేది.
గత మార్చి 24న చిన్నారి అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే ఆ సమయంలో తల్లి ప్రియాంక చెప్పిన వివరణలు ఒక్కోసారి ఒక్కోలా ఉండటంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. ఒకసారి ఆహారం కారణమని, మరోసారి కారులో నిద్రపోయి చనిపోయిందని ఆమె చెప్పినట్లు సమాచారం.
ఈ ఘటనపై అనుమానం పెరిగిన తండ్రి ప్రవీణ్, పోస్ట్‌మార్టం రిపోర్టును విదేశాల్లో ఉన్న వైద్య నిపుణుడికి చూపించారు. నివేదికను పరిశీలించిన తర్వాత చిన్నారి సహజంగా మరణించలేదని, గొంతు నొక్కి ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, ప్రియాంక ప్రియుడు మోహన్‌ను అరెస్ట్ చేశారు. అయితే తల్లి ప్రియాంక ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కోసం గాలింపు కొనసాగుతోంది. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.





























