Shyam Singha Roy: కొత్తగా వస్తున్న యువదర్శకుల నుంచి సీనియర్ దర్శకుల దాకా పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటారు. పవన్ తో హిట్ కొడితే తమ రేంజ్.. మార్కెట్ కూడా పెరుగుతుందని భావిస్తుంటారు. అలాంటి డైరెక్టర్ల జాబితాలో ప్రస్తుతం శ్యాంసింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కూడా చేరారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. చాలా రోజుల గ్యాప్ తరువాత వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వచ్చిన వకీల్ సాబ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను కూడా అందుకుంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. రానా కాంబినేషన్ లో వచ్చిన ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

మళయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషీయుమ్ సినిమాకు రీమేక్ గా భీమ్లానాయక్ తెరకెక్కింది. దీని తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు’లో పవన్ నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమాగా హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. ఇలా చూస్తే దాదాపు 2023 వరకు పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏ సినిమా ఒప్పుకున్నా.. ఆ తరువాతే ఉండనుంది.
మనసులో మాట బయటపెట్టిన యంగ్ డైరెక్టర్:
టాక్సీవాలా, శ్యాంసింగరాయ్ తో వరస హిట్లు అందుకున్న డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తన మనసులో మాట బయటపెట్టాడు. శ్యాంసింగరాయ్ ఇచ్చిన హిట్ కిక్ లో రాహుల్ సాంకృత్యాన్ ఉన్నారు. అయితే తాను శ్యాంసింగరాయ్ సీక్వెల్ మూవీని పవన్ కళ్యాణ్ తో తీయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. సాధారణంగా ఓ హీరో నటించిన సినిమా సీక్వెల్ కు మరో హీరో నటించడానికి ఇష్టపడరు. అయితే రాహుల్ సాంకృత్యాన్ మాత్రం తన శ్యాంసింగరాయ్ సీక్వెల్ సినిమాను పవన్ తో తీయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. శ్యాంసింగరాయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన కోరికను బయటపెట్టాడు. అయితే ఈ యంగ్ డైరెక్టర్ కోరికపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.




























