Doctor Krishna Prabhakar : కరోనా మహమ్మారిని మరచిపోకముందే మరో వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటితో బాధపడుతూ జనాలు ఆసుపత్రి పాలవుతున్నారు. కరోనా వైరస్ చేసిన గాయం వల్ల ఏ చిన్నపాటి జ్వరం వచ్చినా వణికిపోతున్న ప్రజలు ప్రస్తుతం వస్తున్న వైరల్ జ్వరాల మీద అవగాహనా పెంచుకోవడం అవసరమంటూ డాక్టర్ కృష్ణ ప్రభాకర్ చెబుతున్నారు. అసలు కొత్తగా వస్తున్న ఈ H3N2 వైరస్ ఏమిటి, వ్యాధి లక్షణాలు, తీవ్రత అలాగే చికిత్స మందుల గురించి వివరించారు.

కామన్ ఫ్లూ లాంటిదే కానీ నిర్లక్ష్యం తగదు…
డాక్టర్ కృష్ణ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం వస్తున్న జ్వరాలు గతంలో వచ్చిన H1N1 సబ్ వేరియంట్ వే అంటూ చెప్పారు. ఇన్ఫ్లుయెంజ వైరస్ లో పదిరకాల వేరియంట్లు ఉండగా అందులో ఇది ఒకటని తెలిపారు. వీటి కామన్ లక్షణాలు జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు అలసట జ్వరం అంటూ చెప్పారు. జ్వరం ఎక్కువగా ఉండి పనిచేసినా చేయకపోయినా అలసట ఎక్కువగా ఉండటం ప్రధాన లక్షణం అంటూ చెప్పారు. సాధారణంగా జలుబు ఎలా వ్యాపిస్తుందో అలానే ఈ వైరస్ వ్యాప్తి కూడా జరుగుతుందని, కాబట్టి జనం అప్రమత్తం ఉండి మాస్క్ లు ధరించడం వంటివి చేయాలని సూచించారు.

ఇక వీరికి ప్రత్యేకమైన మందులు ఏమీ లేవని కాకపోతే జలుబు, దగ్గు తగ్గేవరకు వాటికి సూచించిన మందులు అలాగే జ్వరం తగ్గే వరకు వాటికి సూచించిన మందులు వాడాలని యాంటీ బయాటిక్ మందులు వాడల్సిన పనిలేదని తెలిపారు. ఈ వైరస్ ముఖ్యంగా చిన్నపిల్లలు అలాగే వృద్దులలో ఎక్కువగా సోకుతుందని చెప్పారు. ఇక షుగర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని, వ్యాధి నిరోధక శక్తి బాగా ఉన్నవాళ్ళలో ఈ వైరస్ తగ్గిపోతుంది కానీ అలా లేని వారిలో ప్రభావం చూపుతుందని తెలిపారు.































