ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీ పరిధిలోని గూడూరు గ్రామంలో గ్రామస్తులు తీసుకున్న వినూత్న నిర్ణయం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా ఐస్‌క్రీం బండ్లకు పూర్తిగా నో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గత కొంతకాలంగా గ్రామంలోకి వస్తున్న ప్రైవేట్ ఐస్‌క్రీం బండ్ల ద్వారా అమ్ముతున్న పదార్థాల వల్ల పిల్లలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని స్థానికులు గమనించారు. ముఖ్యంగా దంత సమస్యలు, జీర్ణకోశ ఇబ్బందులు పెరగడంతో గ్రామ పెద్దలు ఆందోళన చెందారు. ఈ ఐస్‌క్రీంలలో ఏ రకమైన రసాయనాలు, రంగులు కలిపి విక్రయిస్తున్నారో స్పష్టత లేకపోవడం కూడా వారి ఆందోళనకు కారణమైంది.
ఈ నేపథ్యంలో గ్రామ సభ నిర్వహించి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోకి ఐస్‌క్రీం బండ్లు రాకుండా పూర్తిగా నిషేధిస్తూ ‘నో ఎంట్రీ’ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఐస్‌క్రీం అమ్మేవారికే కాకుండా కొనుగోలు చేసే వారిపైనా ఇదే రూల్ వర్తిస్తుందని హెచ్చరించారు.
గూడూరు గ్రామం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా గ్రామంలో మద్యం బెల్ట్ షాపులను తొలగించి ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు కల్తీ ఆహార పదార్థాలపై కఠినంగా వ్యవహరించడం ద్వారా మరోసారి తమ కట్టుదిట్టమైన నిర్ణయాన్ని చూపించింది.
పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ నిర్ణయం సమాజంలో చర్చకు దారి తీస్తోంది. గ్రామస్తుల ఐక్యత, క్రమశిక్షణను అధికారులు కూడా అభినందిస్తున్నారు. ఈ ఘటన ఇతర ప్రాంతాలకు కూడా ఒక సందేశంగా మారుతోంది.





























