విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా అభ్యర్థులకు శుభవార్త. విదేశాల్లో, ముఖ్యంగా జర్మనీలో ఉద్యోగం పొందాలని కలలుకంటున్న వారికి ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వృత్తిపరమైన శిక్షణ అందించి, జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు కల్పించనున్నట్లు విజయనగరం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎం. అన్నపూర్ణమ్మ తెలిపారు.

ఉచిత వృత్తిపరమైన శిక్షణ వివరాలు
ఈ కార్యక్రమం కింద షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) మహిళా యువతకు ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. జర్మనీలో ఉద్యోగం చేయడానికి అవసరమైన జర్మన్ భాషలో 8 నుండి 10 నెలలపాటు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.
- విద్యార్హతలు: బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి రెండేళ్ల క్లినికల్ అనుభవం ఉన్నవారు లేదా జీఎన్‌ఎం నర్సింగ్ పూర్తి చేసి మూడేళ్ల క్లినికల్ అనుభవం ఉన్నవారు అర్హులు.
- వయోపరిమితి: అభ్యర్థుల వయసు 35 ఏళ్ల మించకూడదు. వారే ఈ ఉచిత శిక్షణకు అర్హులు.
- శిక్షణ గడువు: పూర్తి ఉచిత శిక్షణ ఉంటుంది. దాదాపు 8 నెలల నుంచి 10 నెలల వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం రవాణా ఖర్చులు ఏమి లేకుండా జర్మనీ పంపించి ఉద్యోగం ఇస్తారు.
- శిక్షణ కాలం మొత్తం ఉచిత వసతి సదుపాయం కూడా కల్పించబడుతుంది.
- శిక్షణా కేంద్రాలు విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి నగరాల్లో ఏర్పాటు చేశారు.
వేతన వివరాలు
ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ కరెన్సీ ప్రకారం నెలకు రూ.2 లక్షల వరకు జీతం అందిస్తారు.
ఎంపిక విధానం
ఈ అవకాశాన్ని పొందాలనుకునే అర్హులైన మహిళా అభ్యర్థులు తప్పనిసరిగా ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఎంపిక మూడు విభాగాల్లో జరుగుతుంది:
- ప్రాథమిక స్క్రీనింగ్
- ఇంటర్వ్యూ
- వీసా ప్రక్రియ (ఉద్యోగం నిర్ధారమైన తరువాత)
దరఖాస్తు వివరాలు
- అధికారిక వెబ్‌సైట్: http://naipunyam.ap.gov.in
- దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 7
ప్రత్యేక సూచనలు, భవిష్యత్ ప్రయోజనాలు
ఉద్యోగాలు జర్మనీలోనే ఉండటంతో, శిక్షణలో జర్మన్ భాష ప్రావీణ్యం తప్పనిసరి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికార యంత్రాంగం సూచించింది.
ఈ కార్యక్రమం ద్వారా మహిళలు విదేశాల్లో మంచి వేతనాలతో ఉద్యోగాలు పొందే అవకాశం లభించడంతో పాటు, భవిష్యత్ కెరీర్‌కి కూడా ఇది గొప్ప బాటలు వేస్తుందని అధికారులు తెలిపారు.



























