Hero Srikanth : ఒక్కో మెట్టు ఎక్కుతూ విలన్ గా మొదలై సెకండ్ హీరో క్యారెక్టర్ చేస్తూ ఆ తరువాత సోలో హీరోగా ఎదిగిన శ్రీకాంత్ తన కెరీర్ లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసారు. ఇక ఎక్కువ శాతం మల్టీ స్టారర్ చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ ఆడియన్స్ కి తన సినిమాలతో బాగా కనెక్ట్ అయ్యాడు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో మంచి హిట్స్ అందుకున్న శ్రీకాంత్ ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా నేను చేయగలనని నిరూపించాడు ఖడ్గం సినిమాతో, అందులో పోలీస్ ఆఫీసర్ రాధకృష్ణ గా అందరినీ ఆకట్టుకున్నాడు. మహిళా అభిమానులను సొంతం చేసుకున్న శ్రీకాంత్ తన కెరీర్ అలాగే కుటుంబం గురించి ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆ సినిమా విషయంలో బెదిరింపులు చూసాను…
శ్రీకాంత్ సినిమా కెరీర్ లోనే వివాదాస్పద చిత్రం కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన ఖడ్గం సినిమా. ఆ సినిమాలో తాను క్లైమేక్స్ లో చెప్పిన డైలాగుల వల్ల కొన్ని మతాల నుండి అభ్యంతరాలు ఎదురాయ్యాయి. సినిమాను సినిమాలా చూడాలని చెప్పినా కొందరు చంపేస్తాం అంటూ బెదిరించేవారని, కాల్స్ చాలా వచ్చాయంటూ చెప్పారు శ్రీకాంత్.

ఇక తాను ఎక్కడికి వెళ్లినా గన్ తీసుకు వెళ్ళేవాడిని అంటూ చెప్పారు. భయపడలేదు కానీ జాగ్రత్తగా ఉండేవాడిని. క్రికెట్ ఆడటానికి వెళ్లినా కూడా గన్ తీసుకెళ్ళేవాడిని అంటూ ఆ సినిమా మాత్రమే తన కెరీర్ లో కాంట్రవర్సీ అయిన సినిమా అంటూ చెప్పారు. మిగిలిన అన్ని సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గానే ఉన్నాయంటూ అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు.



























