Heroine Divya Vani : నా కొడుకు విషయంలో చాలా బాధపడ్డాను… హిందూ నుండి క్రిస్టియన్ గా నా ప్రయాణం…: హీరోయిన్ దివ్య వాణి

0
422

Heroine Divya Vani : బాపు గారి సినిమాల్లో హీరోయిన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది దివ్య వాణి. ‘పెళ్లి పుస్తకం’ సినిమాలో సత్యభామగా ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుంది. వాలు జడ, పెద్ద కళ్ళతో తెలుగింటి అమ్మాయి అంటే అలానే ఉండాలి అనేంతలా దివ్య వాణి అందం తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దివ్య వాణి అసలు పేరు ఉషారాణి. ఆమె మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమాలో నటించినా తరువాత హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం ఇలా అన్నిభాషలలోనూ సినిమాలను చేసిన దివ్య వాణి తన కెరీర్ అలానే వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

హిందూ నుండి క్రిస్టియన్ గా ప్రయాణం…

దివ్య వాణి గారికి సినిమాల్లో చేస్తున్న సమయంలో త్వరగా తల్లిదండ్రులు పెళ్లి చేసేసారు. ఇక పెళ్లయ్యాక సినిమాలను తగ్గించిన ఆమె కొడుకు కూతురు పుట్టాక వారిని చూసుకోవడం కోసం సినిమాలకు దూరం అయ్యారు. కొడుకు అనారోగ్యంతో ఇబ్బందులు పడినపుడు ఎక్కడ చూపించినా ఆరోగ్య సమస్యలు లేవని చెప్పడంతో అసలు ఏమవుతుందో అర్థమే కాని సమయంలో బ్లాక్ మ్యాజిక్ వంటివి తన భర్త తరుపున వారు చేసుంటారు అన్న అనుమానం వచ్చిందట.

అదే సమయంలో పిల్లలు చదువుతున్న స్కూల్ లో టీచర్ ఏసు ప్రభువు గురించి చెప్పి ప్రార్థన చేయమని చెప్పడం వల్ల అలా బైబిల్ చదవడం అలవాటు చేసుకున్నారట దివ్య వాణి. అలా మొదలయిన ప్రయాణంలో మతం మారలేదని ఏసు ఒక మతం కాదంటూ చెబుతారు. తనకు వచ్చే ఎన్నో సందేహాలకు బైబిల్ లో సమాధానము దొరుకుతుందని చెబుతారు. చర్చికి వెళ్లి ప్రార్థన చేసిన తరువాత తన కొడుకుకి బాగైందని అప్పటి నుండి ఏసు మార్గంలో ఉన్నానంటూ చెప్పారు. అయితే తాను ఇప్పటికీ హిందూనే అంటూ చెప్పారు.