Heroine Vaishnavi Chaitanya : టాలెంట్ ఉంటే ఎక్కడున్నా మనల్ని వెతుక్కుని అవకాశాలు వస్తాయని నిరూపించింది ఈ బస్తి పోరి. హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట బస్తీకి చెందిన వైష్ణవి చైతన్య నేడు ఒక స్టార్ హీరోయిన్. టిక్ టాక్ లో వీడియోలు చేసుకునే పిల్ల నేడు విమర్శకుల ప్రశంసలు అందుకునే స్థాయికి తన నటనతో అబ్బుర పరిచింది. చిన్న సినిమాగా వచ్చిన బేబీ సినిమా నేడు కోట్లు కొల్లగొడుతూ పెద్ద సినిమాలను ఆశ్చర్యపరుస్తోంది. బేబీ సినిమాలో వైష్ణవి నటకు స్టార్ హీరోలు సైతం ఫిదా అయిపోగా మనకు ఒక టాలెంటెడ్ తెలుగమ్మాయి దొరికేసిందని డైరెక్టర్లు సంతోషపడుతున్నారు.

టిక్ టాక్, యూట్యూబ్ సీరీస్ ల నుండి బేబీ వరకు వైష్ణవి…
వైష్ణవి 1996లో విజయవాడలో ఒక మార్వాడి కుటుంబంలో జన్మించింది. తనకు ఒక సోదరుడు ఉండగా చిన్నతనం నుండి సినిమాలో నటించాలనే కోరిక ఉండేది. కుటుంబం హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాక తన చదువు అక్కడే సాగింది. ఇంటర్ తరువాత చదువు ఆపేసిన వైష్ణవి అప్పుడే వచ్చిన డబ్ స్మాష్ ద్వారా వీడియోస్ చేస్తూ నటించాలనే తన కోరిక తీర్చుకుంది. అలా మొదలైన ప్రయాణంలో టిక్ టాక్ తో ఫేమస్ అయ్యాక ఇక అప్పటికే ఫేమస్ అయిన దీప్తి సునయన వంటివారికి గట్టి పోటీనిస్తూ వైష్ణవి అనతి కాలంలో యూట్యూబ్ సీరీస్ లలో కనపడింది.

ఇక ఒకవైపు దిల్ సే మెహబూబ్ తో కలిసి డాన్స్ వీడియోలను చేస్తూనే మరోవైపు యూట్యూబ్ సీరీస్ లతో బిజీ అయింది. సాఫ్ట్వేర్ డెవలెపర్ వంటి సీరీస్ తో బాగా పేరు తెచ్చుకున్న వైష్ణవి ఆపైన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో మెరిసింది. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ చెల్లిగా, వరుడు కావలెను లో చిన్న పాత్ర చేస్తూ చివరికి బేబీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఎంతో కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చిన వైష్ణవి తెలుగమ్మాయిలకి ఒక్క ఛాన్స్ ఇస్తే అద్భుతాలు చేస్తారని నిరూపించింది.































