టాలీవుడ్ యాక్టర్ రాజ్ తరుణ్ మరియు లావణ్యల మధ్య ఇంటి వివాదంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోకాపేట సమీపంలోని పుప్పాలగూడలో ఉన్న ఇంటి విషయంలో నెలల తరబడి కొనసాగిన వివాదానికి హైకోర్టు చివరగా లావణ్యకు షాకింగ్ ఆర్డర్ జారీ చేసింది.

హైకోర్టు తన తీర్పులో, లావణ్యకు ఆ ఇంటిపై ఎలాంటి హక్కూ లేదని, ఆమె రాజ్ తరుణ్ భార్య అని ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అదే విధంగా ఆ ఇంటి డాక్యుమెంట్లలో లావణ్య పేరుతో ఏ సమాచారం లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. కాబట్టి, ఆ ఇంటిలో ఉండేందుకు ఆమెకు అర్హత లేదని, పోలీసు రక్షణ కూడా ఇవ్వలేమని కోర్టు చెప్పింది.
ఇలాంటి వ్యవహారాల్లో సివిల్ కోర్టు ద్వారానే పరిష్కారం పొందాలంటూ హైకోర్టు సూచించింది. “ఇక్కడ సమయాన్ని వృథా చేయొద్దు” అంటూ కోర్టు లావణ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పుతో ఈ ఇంటి వివాదానికి తెరపడినట్టా? లేక మరో కొత్త మలుపు తిరుగుతుందా? అనే ఆసక్తికర ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారం గత ఏడాది నుంచే వార్తల్లో నిలుస్తోంది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, తర్వాత ఇద్దరి మధ్య పలు దఫాలుగా గృహ వివాదాలు, పోలీస్ ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఇటీవల పుప్పాలగూడలో రాజ్ తరుణ్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజ్ తల్లిదండ్రులు – లావణ్య మధ్య వాగ్వాదం జరగగా, ఆమె ఇంటిని ఖాళీ చేయాలని నిరసనకు దిగారు. అయితే జనవరిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని ఇతరులకే అమ్మేశాడన్న సమాచారం తర్వాత బయటకు వచ్చింది. కానీ ఆ విషయాన్ని లావణ్య అంగీకరించకుండా అదే ఇంటిలో ఉండిపోయింది.
ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో లావణ్యకు ఎదురుదెబ్బ తగిలినా, ఈ వివాదం ఇదివరకే ఎన్ని మలుపులు తిరిగిందో చూస్తే, ఇది ఇంకా ముగిసిందని చెప్పలేం అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వివాదానికి పూర్తి ముగింపు ఎప్పుడు వస్తుందో చూడాలి.
































