అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విషయం మీకు తెలుసు. ఈ ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 241 మంది ప్రయాణికులు కాగా, మిగిలిన వారు వైద్య సిబ్బంది. విమానం వైద్య కళాశాల వసతి గృహంపై కూలడంతో భవనం పూర్తిగా ధ్వంసమైంది.

ప్రమాదం సమయంలో 24 మంది మరణించగా, గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో తొమ్మిది మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 33కి చేరింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రమాదంలో బాధితులైన కుటుంబాలకు నష్టపరిహారం ఎంత ఇస్తారు?
విమానానికి బీమా సదుపాయం ఉంటుంది. బీమా సంస్థ నుంచి నష్టాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ విమాన ప్రమాదం దేశ చరిత్రలోనే అతిపెద్ద ఏవియేషన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌గా నమోదవుతోంది. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత విమానయాన సంస్థదే.
1999 నాటి మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం, విమానం ప్రమాదానికి గురై ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగితే, సంబంధిత విమానయాన సంస్థే ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. విమానంలో ప్రయాణికుల వస్తువులు, సామాగ్రి ధ్వంసమైనా, అవి వారికి అందడంలో ఆలస్యం జరిగినా పరిహారం ఇవ్వాల్సిందే.
ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉంది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానాన్ని దాదాపు రూ.960 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించింది. అయితే, అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదంలో, నిబంధనల ప్రకారం, ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కో బాధిత కుటుంబానికి 1,51,880 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఎస్డీఆర్ విలువ దాదాపు రూ. 120. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి రూ.1.80 కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉంది.
మాంట్రియల్ తీర్మానం కింద ఇచ్చే పరిహారంతో పాటు, ఒక్కో కుటుంబానికి అదనంగా రూ.కోటి చొప్పున ఇస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. అంటే ఒక్కో కుటుంబానికి రూ.2.80 కోట్ల పరిహారం దక్కబోతోంది































