1970 అర్ధ భాగంలో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన మోహన్ బాబు, స్వర్గం నరకం శివరంజని, డ్రైవర్ రాముడు, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం ప్రేమాభిషేకం, దేవత, వారసుడొచ్చాడు మంచి దొంగ, కొండవీటి దొంగ లాంటి చిత్రాల్లో విలన్ గా నటించిన అప్పటికీ.. 1990 ప్రాంతానికి వచ్చేసరికి అల్లుడుగారు సినిమా తో హీరోగా మంచి గుర్తింపు పొందారు. ఇక అక్కడి నుండి అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, రౌడీ గారి పెళ్ళాం, పెదరాయుడు లాంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించారు.

ఇన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ అల్లుడుగారు సినిమా మోహన్ బాబు సినీ కెరీర్ లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా పేర్కొనవచ్చు. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా హంగు ఆర్భాటాలు పెట్టకుండా సింపుల్ గా రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అల్లుడుగారు సినిమా1990 జూలై 14 విడుదలై ఘన విజయాన్ని సాధించింది.

అయితే సినిమా విషయానికి వస్తే కిరాయి మొగుడు గా శోభన ఇంట్లో ప్రవేశించిన మోహన్ బాబు “అసలే నాది లైఫ్ అండ్ డెత్ సమస్య” అంటూ ప్రతిసారి చంద్రమోహన్ వద్ద డబ్బులు లాగుతూ.. రాత్రి అయ్యిందంటే శోభన తో అస్తమానం గొడవ పడడం సినిమాకి ఒక హైలైట్ గా చెప్పుకోవచ్చు. సత్యానంద్ రాసిన సంభాషణలు కడుపుబ్బా నవ్విస్తాయి.
అచ్చోసిన ఆంబోతుల అరుస్తున్నావ్.. కాదు నువ్వే పిచ్చి పట్టిన గజ్జి కుక్కల అరుస్తున్నావ్.. తొండ గుడ్డు ముఖం.. తేలు కొండి మూతి.. కుళ్లిపోయిన అరటి పండు తొక్క.. కంపుకొట్టే చెత్తకుప్ప.. ఏ హే బూజు దులిపే చీపురు కట్ట.. ఏహే ఏరి పారేసిన ఎంగిలాకు…. ఆపు నీ డమ్మ..డొక్కు..డయ్యాల..డాలి డుండుల..కింజల..పింజల..గింజ.!! ఇది అడవి భాషలో అతిపెద్ద నీచమైన తిట్టు. అని మోహన్ బాబు అనడంతో శోభన తెల్లమొహం వేస్తుంది. వీరి మధ్య తరచు వచ్చే ఈ తిట్లపురాణం ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేశారు. అలా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.































