రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు దమనకాండను పంటి బిగువున నిలిపి స్వేచ్ఛా వాయువులను పురిటి నొప్పులతో రక్తాశ్రువులు చిందిస్తూ తెల్లదొరల దాస్య శృంఖలాల నుండి భారతావని విముక్తి కోసం పోరాడిన స్వాతంత్ర పోరాట సమరయోధులు ఎందరో మరెందరో..

వారి త్యాగ ఫలానికి భారతీయుడు మోకరిల్లి వందనాలు చేయాల్సిందే… కానీ నేడు కుహన రాజకీయాల ఏలికలో 75 వసంతాలకు చేరువవుతున్న భారతావని.. సగటు భారతీయుడు అజ్ఞానం, అవివేకం, అవినీతి, లంచగొండితనం సగటు మనిషిని కాలసర్పంలా ఇంకా కాటేస్తూనే ఉన్నాయి. అలాంటి ప్రతికూల విషయాలపై దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రమే భారతీయుడు సినిమా.

ఆనాటి ఫ్రీడమ్ ఫైటర్స్ లో సుభాష్ చంద్రబోస్ అంటే డైరెక్టర్ శంకర్ కు చాలా ఇష్టం. ఆయన ఇంకా బతికి ఉంటే ఇప్పటి పరిస్థితులను చూసి ఆయన ఏం చేసేవారు. అనే కాన్సెప్ట్ లో నుంచి వచ్చినదే భారతీయుడు చిత్రం. ఈ చిత్రానికి నటీనటుల విషయంలో స్వాతంత్ర పోరాటం చేసిన వృద్ధుడు పాత్ర లో కమల్ హసన్ నటించగా, ఆయన కొడుకు పాత్రలో ముందుగా అజిత్ ను అనుకున్నారు. కానీ చివరికి కమల్ హాసన్ ఆ పాత్రను పోషించారు. హీరోయిన్స్ గా ఐశ్వర్యరాయ్, శిల్పా శెట్టిని అనుకున్నప్పటికీ, ఒక యాడ్ ఏజెన్సీకి ఇచ్చిన కమిట్మెంట్ లో భాగంగా ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో చేయలేకపోయింది. అలాగే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో శిల్పా శెట్టి కూడా భారతీయుడు చిత్రాన్ని వదులుకుంది.

అయితే అప్పటికే బొంబాయి సినిమా విడుదలై అద్భుత విజయాన్ని సాధించడంతో.. అందులో నటించిన మనిషా కొయిరాల మొదటి హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ తర్వాత రెండో హీరోయిన్ గా సూపర్ హిట్ రంగీలా చిత్రం లో నటించిన ఊర్మిళ ను ఎంపిక చేసుకున్నారు. వృద్ధ కమలహాసన్ కు జోడిగా ముందుగా రాధికను అనుకున్నప్పటికీ ఆమె కొన్ని టీవీ సీరియల్స్ లో బిజీగా ఉండడంతో ఆమె ప్లేస్ లో సుకన్య ను తీసుకున్నారు.

భారతీయుడు చిత్రానికి సంగీత దర్శకుడిగా ఏ.ఆర్. రెహమాన్ ను ఎన్నుకున్నారు. అప్పటికే ఆయన ఇచ్చిన పాటలు ఏ.ఆర్.రెహమాన్ హిస్టరీ లోనే ది బెస్ట్ గా మిగిలిపోయాయి. వృద్ధుడి పాత్రలో కనిపించే కమలహాసన్ కు మేకప్ వేయడానికి అమెరికా నుంచి ప్రత్యేకమైన మేకప్ మెన్ రావడం జరిగింది. దాదాపు కమలహాసన్ మేకప్ కోటి రూపాయలు ఖర్చు చేశారు. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదాన అనే పాటను ఆస్ట్రేలియాలో చిత్రీకరించడం జరిగింది.

ఆస్ట్రేలియాలో చిత్రీకరించిన మొదటి దక్షిణాది చిత్రం భారతీయుడు. ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ ఆ రోజుల్లో 14 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఖర్చు విషయంలో ఏ.ఎం, రత్నం ఏమాత్రం వెనుకంజ వేయలేదు. అదిరేటి డ్రెస్సు మీరేస్తే అనే పాటకు దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. 1995 లో వచ్చిన భాషా మూవీ అప్పటికే 38 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది. భాషా చిత్రం వసూళ్లను దాటాలి అంటే దాదాపు ఐదు సంవత్సరాలు అయిన గడవాలి అని అనుకున్నారు. కానీ కేవలం ఒక సంవత్సరం లోపే 1996 మే లో భారతీయుడు సినిమా విడుదలై 55 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అంటే దాదాపు భారతదేశంలోని అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో మొదటిది హమ్ ఆప్కే హై కౌన్, రెండవది దిల్వాలే దుల్హానియా లేజాయింగే, మూడవ స్థానంలో భారతీయుడు సినిమా నిలిచింది. ఇందులో నటించిన నటశిఖర కమలహాసన్ కి, తన సృజనాత్మకతో ఈ సినిమాని అద్భుతంగా మలిచిన శంకర్ కు సెల్యూట్ కొట్టాల్సిందే.































