పార్లె-జి బిస్కెట్ కంపెనీల్లో ఓ సంచలనం. మల్టీనేషనల్ కంపెనీలకు సైతం ముచ్చెమటలు పట్టించిన అచ్చమైన భారతీయ సంస్థ. ప్రస్తుతం అంటే రకరకాల బిస్కెట్లు అందుబాటులోకి వచ్చాయి కానీ.. గతంలో పార్లే-జి ఒక్కటే దేశంలోని ప్రతి ఇంటి గడపతొక్కింది అని చెప్పుకోవచ్చు. భారతీయులకు ఈ బిస్కెట్లతో ఎంతో అనుభంధం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నా.. లేకున్నా.. జనాల ఆదరణ మాత్రం తగ్గలేదు. ఎందుకు జనాలకు ఈ కంపెనీ బిస్కెట్లపై అంత నమ్మకం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

1929వ సంవత్సరంలో మన దేశాన్ని ఆంగ్లేయులు పాలిస్తున్నారు. అప్పట్లో విదేవీ వస్తు బహిష్కరణ.. స్వదేశీ వస్తువుల వాడకంపై దేశ వ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతుంది. అదే సమయంలో భారత్ లో యునైటెడ్ బిస్కెట్లు, హంట్లీ పామర్స్ , బ్రిటానియా, గ్లాస్కో కంపెనీల బిస్కెట్లు రాజ్యం ఏలుతున్నాయి. మనకంటూ ఓ బ్రాండ్ బిస్కెట్లు లేదు. అందుచేత భారతీయులకు ఓ కంపెనీ ఉండాలని ముంబైకి చెందిన సిల్క్ బిజినెస్ మ్యాన్.. మోహన్ లాల్ దయాల్ జర్మనీకి వెళ్లాడు. అక్కడ బేకరీ వస్తువుల తయారు చేసే విధానం, ఇందుకోసం వాడే యంత్రాల గురించి తెలుసుకుని వచ్చాడు. వచ్చే సమయంలో అప్పట్లోనే రూ. 60 వేలు పెట్టి బేకరీ ఐటెమ్స్ తయారు చేసే యంత్రాలను భారత్ కు తీసుకొచ్చాడు.

ముంబైలోని ఇర్లా అండ్ పార్లా అనే ఏరియాలో ఓ చిన్న ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. అందులో మొదట్లో 12 మంది మాత్రమే పనిచేసేవారు. వారుకూడా మోహన్ లాల్ ఫ్యామిలీ మెంబర్సే. తొలి రోజుల్లో ఆరెంజ్ క్యాండీ, టాఫీలు మాత్రమే ఉత్పత్తి చేసేవారు. 10 ఏండ్ల తర్వాత ఆ కంపెనీ ఉన్న పార్లా పేరుతో పార్లే అనే పేరు కంపెనీకి పెట్టాడు. స్వదేశీ వస్తువుల వాడకంతో మొదలైన ఉద్యమం సందర్భంగా బిస్కెట్లు తయారు చేయడం మొదలు పెట్టింది ఈ కంపెనీ. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పార్లె కంపెనీ పార్లె గ్లూకో పేరుతో బిస్కెట్లు తయారు చేసి అమ్మింది.

అప్పట్లో బ్రిటిష్ కంపెనీలను తట్టుకుని పార్లె బిస్కెట్లు విస్తరించాయి. విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం నేపథ్యంలో జనాలంతా మన దేశానికి చెందిన పార్లె బిస్కెట్లను మాత్రమే కొనేవారు. దీంతో జనాలకు పార్లెకు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. స్వాతంత్రం అనంతరం పార్లె కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయినా కొత్త ఉత్పత్తులను మొదలు పెట్టి మిగతా కంపెనీలకు దడ పుట్టించింది. పార్లె గ్లూకోను కాస్త పార్లె-జిగా మార్చింది. అద్భుత ప్రకటనలతో జనాలను ఆకట్టుకుంది. స్వచ్చమైన స్వదేశీ బ్రాండ్ గా పార్లె-జి నిలిచిపోయింది.





























