Justin Bieber : పాప్ సంగీతం ప్రపంచంలో అతి చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులతో క్రేజ్ తెచ్చుకున్న సింగర్ జస్టిన్ బీబర్. బేబీ బేబీ అంటూ పాడిన పాట వరల్డ్ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఇక ప్రతి ఆల్బమ్ తో తన అభిమానులను రెట్టింపు చేసుకున్న ఈ యువ కెరటం అంతే వివాదాల్లోను చిక్కుకున్నాడు. ఇక కెరీర్ ముగిసిపోయింది అనే లోపే మళ్ళీ పడి లేచిన కెరటం లాగా లేచాడు జస్టిన్. పెళ్లి చేసుకుని సాఫీగా తన కెరీర్ ను కొనసాగిస్తున్న జస్టిన్ వరల్డ్ టూర్ ప్రారంభించాడు. కానీ ఆ పర్యటనను ప్రస్తుతం రద్దు చేసాడు. జస్టిన్ ఫేసియల్ పెరాలసిస్ తో బాధపడుతున్నట్లు వీడియో ద్వారా స్వయంగా తానే అభిమానులకు చెప్పారు.

రామ్సే హంట్ సిండ్రోమ్ వల్ల ఫేసియల్ పెరాలసిస్….

తన ముఖంలోని కుడి భాగం కదపలేక పోతున్నట్లు తెలిపాడు. రామ్సే హంట్ సిండ్రోమ్ అనే వైరస్ తన చెవుల నరాల ద్వారా సోకడం వల్ల పక్షవాతం వచ్చినట్లు తెలిపాడు. వీడియోలో చూపిస్తూ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. మీకు కనిపిస్తోంది కదా, ఈ కన్నుకొట్టడానికి రావడం లేదు ముఖంలో ఈ వైపు నవ్వలేకపోతున్నాను. నా ముఖం మీద ఈ పక్క పూర్తి పక్షవాతం వచ్చింది అని వీడియో లో చూపిస్తూ చెప్పారు. నా చెవిలోని నరం మీద, నా ముఖపు నరాల మీద ఈ వైరస్ దాడి వల్ల నా ముఖానికి పక్షవాతం సోకింది అంటూ తన ముఖంలోని కుడి పక్కను సూచిస్తూ ఆ వీడియోలో జస్టిన్ చెప్పారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇలా అవ్వక పోయుంటే బాగుండేది. కానీ నేను కాస్త స్లో అవ్వాలని నా శరీరం చెప్తోంది. మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నా. ఈ సమయాన్ని విశ్రాంతి తీసుకోవటానికి ఉపయోగిస్తాను. నేను ఏ పని కోసం పుట్టానో ఆ పని చేయటం కోసం వంద శాతం కోలుకోవటానికి ప్రయత్నిస్తాను అని 24 కోట్ల మంది ఫాలోయర్స్ తో పంచుకున్నారు.
రామ్సే హంట్ సిండ్రోమ్ అనేది షింగ్లిస్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల చెవుల దగ్గర ఉండే ముఖ నరాలకు సోకి వచ్చే వ్యాధి. దీనివల్ల ముఖం లోని ఒకవైపు పక్షవాతానికి గురవుతుంది. ఇది కొంతమందిలో తాత్కాలికంగా ఉన్నా కొంతమందిలో తీవ్రతరం అవుతుంది. ఓ వైపు కన్ను కొట్టడానికి కూడా రాకపోవడం వల్ల కంటి నొప్పి ఎక్కువై చూపు మందగించే అవకాశం ఉందని అలాగే చెవి నరాలకు వైరస్ సోకడం వల్ల వినికిడి సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. 60 ఏళ్లకు పైబడిన వారిలో ఈ వ్యాధి లక్షణాలు అధికంగా ఉంటాయి. కాగా జస్టిన్ వయసు ప్రస్తుతం 28 సంవత్సరాలు. ఇక జస్టిన్ భార్య హేలి బీబర్ కూడా గత మార్చిలో మెదడు లో రక్తం గడ్డకట్టడం వల్ల హాస్పిటల్ లో చేరారు. ఇక గుండెలో ఒక రంధ్రం మూసుకుపోవడం వల్ల సర్జరీ చేయించుకున్నారు. జస్టిన్ ప్రస్తుతం తన పాటల కచేరిలన్నింటిని రద్దు చేసారు. ఫేసియల్ ఎక్సర్సైజులు చేస్తున్నట్లు తగిన చికిత్స తీసుకుని తిరిగి మళ్ళీ అభిమానుల ముందుకు వస్తానని తెలిపారు.
































