KCR : కర్ణాటక ఫలితాలు.. తెలంగాణలో మంటలు.. చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్‌కు ఊహించని షాక్..!

KCR : కర్ణాటక ఎన్నికల ఫలితం రానే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. బీజేపీ పాతాళానికి పడిపోయింది. కింగ్ మేకర్ అవుతారనుకున్న జేడీఎస్ అధినేత కుమారస్వామి కనీసం కొడుకును కూడా గెలిపించుకోలేక చతికల బడ్డారు. ఇక ఎన్నో రోజులుగా కర్ణాటక ఎన్నికల ఫలితం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన తెలంగాణకు ఆ తరుణం రానే వచ్చేసింది. ఈ ఎన్నికల ఫలితం.. ఒక్కో పార్టీకి ఒక్కో రకమైన ఫీలింగ్ ఇచ్చింది. బీజేపీకి కర్ణాటక ఘోర పరాజయం అనేది తెలంగాణలో తీరని నష్టాన్ని కలిగించే అంశం. ఇక కాంగ్రెస్ పార్టీ బీభత్సంగా బూస్ట్ ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఇది ఊహించని షాక్. ఈ పార్టీ కుమారస్వామిని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్, బీజేపీలను శాసించాలని భావించింది. డామిట్.. కథ అడ్డం తిరిగింది. ఊహించని పరిణామంతో గులాబీ బాస్ దెబ్బకు కుదేలయ్యారు.

రాజకీయాలను శాసించాలనకున్నారు..

తెలంగాణ ఎన్నికలను శాసించాలనుకోవడం వరకూ ఓకే కానీ కర్ణాటకను కూడా శాసించాలనుకోవడం పిచ్చితనమే అవుతుంది. కాంగ్రెస్, బీజేపీలలో దేనికీ స్పష్టమైన మెజారిటీ రాదు.. కాబట్టి జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుంది. తబ్ ఖేలేంగే ఖేల్ అన్నట్టుగా సీఎం కేసీఆర్ ఉన్నారు. కింగ్ కాస్త కుదేల్ అయ్యారు. కనీసం కుమారస్వామి తన కొడుకు నిఖిల్ గౌడను సైతం గెలిపించుకోలేకపోయారు. ఏదో అవుతుందనుకుంటే ఇంకేదో అయ్యింది. దారుణాతి దారుణ పరాజయం. నిన్న ఉదయం వరకూ ఫుల్ జోష్‌లో ఉన్న కుమారస్వామి ఫలితాల తర్వాత కంగుతిన్నారు. ఇక సీఎం కేసీఆర్.. కుమార స్వామిని అడ్డు పెట్టుకుని కర్ణాటక రాజకీయాలను శాసించాలనుకున్నారు. కానీ సీన్ రివర్స్. కాంగ్రెస్ పార్టీని అందుకోవాలంటే ప్రస్తుత తరుణంలో ఎవరి తరమూ కాదు. బీజేపీ, జేడీఎస్, స్వతంత్రులందరూ కలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేరు. ఇలాంటి తరుణంలో కుమారస్వామి కింగ్ మేకర్ ఆశలన్నీ గల్లంతయ్యాయి.

Good News: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..! ఇక అన్నీ ఆ కార్డులోనే..!

మరింత బూస్ట్ ఇచ్చిన కర్ణాటక ఫలితాలు..

ఇక ఇప్పుడిప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. ఈ తరుణంలో కర్ణాటక ఫలితాలు ఆ పార్టీకి మరింత బూస్ట్ ఇచ్చాయి. ఇక పార్టీ నేతలంతా కలహాలను పక్కనబెట్టి కలిసి ముందుకెళితే తెలంగాణలో కూడా విజయం ఖాయం. ఎలాగూ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు రాష్ట్రంలో సానుభూతి బీభత్సంగానే ఉంది. కేవలం కలహాల పార్టీ కావడంతో ఆ పార్టీని జనం దూరం పెట్టారు. అదే అంతా కలిసి వెళితే మాత్రం మంచి ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో ఈ విషయం తెలుసుకున్నారో ఏమో కానీ కాస్త అంతా కలిసి వస్తున్నారు. ఇక పార్టీ అధిష్టానం కూడా తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అన్నీ కలిసొస్తే రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారం కాంగ్రెస్ పార్టీదే అయినా ఆశ్చర్యం లేదు. ఈ విషయం కేసీఆర్‌కు తెలియనిది కాదు. మొత్తానికి అక్కడ దెబ్బ కొట్టి ఇక్కడ లబ్ధి పొందాలనుకున్న కేసీఆర్‌కు ఈ ఫలితం చెంపపెట్టేనని చెప్పాలి.

హిమాచల్‌ప్రదేశ్ తర్వాత కర్ణాటక ఇక తెలంగాణలో కూడా అదే ప్లాన్ అమలు చేస్తే..

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అక్కడి ప్రజానీకం అవసరాలను టార్గెట్ చేసి సక్సెస్ సాధించింది. ఆ తరువాత కర్ణాటకలోనూ అదే ప్లాన్‌ను రిపీట్ చేసింది. సక్సెస్ అయ్యింది. దాన్నే తెలంగాణలో కూడా అమలు చేస్తే సక్సెస్ అవడం ఖాయం. అదేంటేంటే.. జనాలకు అవసరమైన హామీలు ఇచ్చేసింది. పలు పథకాలను ప్రకటించి వాటిలో భాగంగా.. మెయిన్‌గా కరెంట్ బిల్లలు వాచిపోతున్న తరుణంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. గృహిణులకు నెలకు రూ.2000, నిరుద్యోగ పట్టభద్రులకు రూ.3000, డిప్లమా పట్టాదారులకు నెలకు రూ.1500, నిరుపేద కుటుంబాలకు ఉచితంగా నెలకు 10 కిలోల బియ్యం వంటి ఎన్నో హామీలకు కాంగ్రెస్ గుప్పించింది. పైగా నేతలంతా కలహాలను పక్కనబెట్టి కలిసికట్టుగా ముందుకెళ్లడం లాభించింది. ఇదే స్కెచ్‌ను తెలంగాణలో సైతం అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.