Kondanda Rami Reddy : ఖైదీ 1983లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తొలి చిత్రంతోనే చిత్రసీమలో పేరు శాశ్వతంచేసుకున్న కొన్ని పతాకాలున్నాయి. అడవి రాముడు తీసిన సత్యచిత్ర, వేటగాడు తీసిన రోజా మూవీస్ ఆ కోవకు చెందినవే. ఖైదీ చిత్రంతో సంయుక్త మూవీస్ అటువంటి కీర్తి సంపాదించుకుంది. చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్ ఈ చిత్రంతోనే మొదలయ్యింది. చిరంజీవిని అగ్రనటునిగా, కోదండరామిరెడ్డిని గురువుకి తగ్గ శిష్యునిగా, పరుచూరి సోదరులు ను ప్రముఖ రచయితలుగా నిలిపిన చిత్రం.

ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..
నెల్లూరుకు చెందిన ధనుంజయరెడ్డి, తిరుపతిరెడ్డి, సుధాకర్ రెడ్డిలు నా దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. అప్పటికి నేను జ్యోతి చిత్రం చేయడం, ఆ సినిమా సూపర్ హిట్ అవడం జరిగింది. ఆ చిత్రాన్ని చూసిన ప్రముఖ నిర్మాత క్రాంతి కుమార్ నాతో సినిమా తీయాలనుకున్నారు.ఆ క్రమంలో ఒక ప్రముఖ నవల ఆధారంగా “న్యాయం కావాలి” చిత్రాన్ని రూపొందించాం.ఆ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చడంతో మంచి విజయాన్ని సాధించింది.ఆ తర్వాత చిరంజీవితో “అభిలాష” చిత్రాన్ని రూపొందించాము.ఆ సినిమాలో యురేకా సకమిక..అనే పాట యూత్ ని విపరీతంగా కట్టుకుంది. ఆ సినిమా విజయంలో ఆ పాట కీలక భూమికను పోషించింది.నేను నిర్మాతలు చిరంజీవి నెల్లూరు వాసులం కాబట్టి, కలిసివ సినిమా చేస్తే ఎలా ఉంటుందనుకున్నాం.

నిర్మాతల సూచన మేరకు ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ మంచి కథను సిద్ధం చేశారు.అది మా అందరికీ నచ్చడంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం.అయితే చిరంజీవి ఇచ్చిన డేట్స్ దగ్గర పడడంతో పరుచూరి బ్రదర్స్ వారం రోజుల్లో కథ సంభాషణలు పూర్తి చేశారు.ఈ కథ ఎంత బాగా వచ్చిందో సినిమాలోని పాటలు కూడా చక్రవర్తి అంత బాగా సమకూర్చారు.అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.ఆ రోజుల్లో “రగులుతుంది మొగలి పొద..అనే పాటలో శృంగారం మోతాదు మించిందని ఎలాంటి అభ్యంతరాలు రాలేదా అని యాంకర్ అడగగా.. ఆరోజుల్లో అలాంటి అభ్యంతరాలు ఏవి రాలేదు.అంతకుముందు సినిమాల్లో కాకుండా కొత్తగా ఒక సాంగ్ ఉండాలని మేము అప్పుడు అనుకొని తీసిందే “రగులుతుంది మొగలి పొదా..గుబులుతోంది కన్నె ఎదా.. నాగినిల వస్తున్న..కౌగిలినే ఇస్తున్న.. కాటేస్తావో..మాటేస్తావో…ఓ..ఓ..

ఈ పాటకు ఆ రోజుల్లో కుర్రాళ్లంతా థియేటర్లో ఒకటే ఈలలు,గోలలు.. ఈ పాట సినిమాను మరో స్థాయికి తీసుకువెల్లింది.ఆనాటి స్టార్ హీరోల చిత్రాల కంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ కి ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా థియేటర్స్ లో నడుస్తున్న సమయంలో.. రోడ్డుపై ఒక అతను ఈ పాటకు నాగిని డాన్స్ చేసుకుంటూ.. చాలాసార్లు కనిపించాడు. అప్పుడు అర్థమైంది ఖైదీ సినిమాలో ఈ పాట ప్రేక్షకులను ఇంతగా ప్రభావితం చేసిందానని. ఇప్పటికీ ఆ పాటకున్న ప్రత్యేకత వేరని ఆ ఇంటర్వ్యూలో దర్శకుడు కోదండరామిరెడ్డి వివరించారు.

































