ఐపీఎల్ 2026 సీజన్‌లో కీలక మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో యువ ఆటగాడు సాహిల్ పారఖ్ తీవ్రంగా గాయపడడంతో జట్టులో ఆందోళన నెలకొంది. ఈ సంఘటనతో ఆటగాళ్లు, సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు జట్టు శుక్రవారం సాయంత్రం నెట్స్‌లో ప్రాక్టీస్ నిర్వహిస్తోంది. బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో వేగంగా వచ్చిన బంతి సాహిల్ ముఖానికి బలంగా తాకింది. ముఖ్యంగా నోటి వద్ద బలమైన దెబ్బ తగలడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెంటనే మైదానంలోని మెడికల్ టీమ్ అతనికి ప్రాథమిక చికిత్స అందించడానికి ప్రయత్నించింది. అయితే రక్తస్రావం ఆగకపోవడంతో పరిస్థితి అత్యవసరంగా మారింది. దీంతో అంబులెన్స్‌ను మైదానంలోకి రప్పించి అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాహిల్ పారఖ్ గురించి మాట్లాడితే, మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఈ 18 ఏళ్ల యువ క్రికెటర్‌ను ఈ ఏడాది మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రతిభ కనబరిచి ఐపీఎల్‌లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడం అతడికి పెద్ద దెబ్బగా మారింది.
వైద్యుల సమాచారం ప్రకారం అతడికి శస్త్రచికిత్స అవసరం కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనతో జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా ఆందోళన చెందుతున్నారు.
కీలక మ్యాచ్‌కు ముందు జరిగిన ఈ సంఘటన ఢిల్లీ జట్టు ప్లాన్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.



























